జనసేన(Janasena), టీడీపీ(TDP)ల పొత్తు చివరి వరకూ ఉంటారనేది అనుమానమేనని మంత్రి కొట్టు సత్యనారాయణ(Minister Kottu Satyanarayana) అన్నారు. పశ్చిమ గోదావరిలో ఆయన మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధర్మాన్ని ఆశ్రయించారని ఎద్దేవా చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసే రెండు స్థానాలను ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ ప్రకటించారు.
టీడీపీ రెండు సీట్లు ప్రకటించిన తానూ రెండు స్థానాలను ప్రకటిస్తున్నట్లు పవన్ చెప్పారు. ఈ నేపథ్యంలో మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. జనసేనాని పొత్తులో ఉన్నా ఎవరి దారి వారిదేనని విమర్శించారు. విహంగ వీక్షణ అంటే ప్రజలను గాలికి వదిలేస్తారా? పొత్తులు చివరివరకు ఉంటాయో? లేదో? అనేది చూడాల్సిందే అంటూ సెటైర్లు విసిరారు. పద్ధతి ప్రకారం సీఎం వైఎస్ జగన్ ముందుకు వెళ్తున్నారని అన్నారు.
మీ కుటుంబాలకు మేలు జరిగితే.. నాకు ఓటు వేయమని సీఎం అడుగుతున్నారని మంత్రి చెప్పుకొచ్చారు. చంద్రబాబు తాను చేసిన మోసాలు చూసి ఓటు వేయమని అడుగుతారా?, పవన్ ప్రజలను ఏమని ఓటు అడుగుతారు? అని మంత్రి ప్రశ్నించారు. అదేవిధంగా ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలపై ఆయన విమర్శలు చేశారు. షర్మిలకు ఇంకా రాజకీయ పరిణతి లేదన్నారు.
ఆమె చంద్రబాబు ఉచ్చులో పడిపోయారని, తండ్రి ఆశయాలను గాలికి వదిలేసి చంద్రబాబు స్క్రిప్ట్ షర్మిల చదువుతున్నారంటూ మండిపడ్డారు. వైఎస్ రక్తం పంచుకుపుట్టిన షర్మిల లేనిపోని అబాండాలు సీఎం జగన్‌పై వేస్తున్నారని, రాష్ట్రానికి అన్నివిధాలుగా ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీతో షర్మిల చేతులు కలిపారని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నవారు ధర్మపక్షం ఉన్నట్లని మంత్రి కొట్టు అన్నారు.