తెలంగాణ (Telangana)లో ఎన్నికలు ఇంకా జరగలేదు.. అప్పుడే నేతలు తమదే విజయం అనే ధీమాలో ఉన్నారని జనం అనుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టేది తామే అని కాంగ్రెస్ (Congress) ప్రచారం చేసుకుంటుండగా.. కాదు కాదు తెలంగాణలో గుబాళించేది గులాబీ అని కారు పార్టీ నేతలు టాప్ గేర్ లో ప్రచారాలు నిర్వహిస్తున్నారు. మంత్రుల నుంచి నేతలు, కార్యకర్తల వరకు ఇవే మాటలు మాట్లాడుకోవడం నిత్యం వినిపిస్తున్నాయి.
ఇక తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ వెలువరించిన ‘కాంగ్రెస్ చేసిందేంది’అనే సంకలనాన్ని ప్రగతిభవన్ (Pragati Bhavan)లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి కేటీఆర్ (KTR) మరోసారి కాంగ్రెస్ పై విరుచుకు పడ్డారు. తెలంగాణను పునర్నిర్మిస్తున్నదెవరో ఇక్కడి మట్టికి తెలుసునన్న కేటీఆర్.. గోల్‌మాల్ కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మరని విమర్శించారు.
తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడం కాంగ్రెస్ వల్ల కాదని.. డిసెంబర్ 3న తెలంగాణ అంతా గులాబీమయం కాబోతున్నదని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు పన్నినా 30న బ్యాలెట్ బాక్సుల్లో నుంచి బయటకు వచ్చే బీఆర్‌ఎస్ విజయం దొంగ పార్టీలకు చెమటలు పట్టిస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ఎండిన భూములు బీఆర్‌ఎస్ పాలనలో పచ్చగా మారాయని కేటీఆర్ తెలిపారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ వ్యవహారాన్ని కళ్లకు కట్టినట్లుగా పుస్తకాన్ని రూపంలో వెలువరించిన జూలూరి గౌరీశంకర్‌ను కేటీఆర్ అభినందించారు. మరోవైపు తెలంగాణలో నవంబర్ 30వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి.