Telugu News » KTR : కాంగ్రెస్ పాలన.. మోసం, వంచన, దోఖాలమయం!

KTR : కాంగ్రెస్ పాలన.. మోసం, వంచన, దోఖాలమయం!

కాలకేయుల కాలం వస్తే కరెంట్‌ కోతలు.. కటిక చీకట్లు గ్యారెంటీ అంటూ సెటైర్లు వేశారు కేటీఆర్. మూడు రంగుల ఊసరవెల్లిని నమ్మితే మూడు గంటల కరెంటే గతి.. ఉచిత విద్యుత్ ఊడగొట్టడం గ్యారెంటీ అని మండిపడ్డారు.

by admin
ktr meeting with maharashtra representatives of real estate

– రాబందుల రాజ్యమొస్తే..
– రైతుబంధు రద్దవడం గ్యారెంటీ
– కాంగ్రెస్ వస్తే కరెంట్‌ కోతలు..
– కటిక చీకట్లు గ్యారెంటీ
– రైతుబీమా.. ధీమా గల్లంతవ్వడం గ్యారెంటీ
– దాచి.. దాచి దెయ్యాలకు పెట్టేంత ఎడ్డిది కాదు.. నా తెలంగాణ
– కాంగ్రెస్ గ్యారెంటీలపై కేటీఆర్ సెటైర్లు

కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలపై బీఆర్ఎస్ (BRS) నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. మంత్రి కేటీఆర్ (KTR) ట్విట్టర్(ఎక్స్)లో స్పందిస్తూ.. కాంగ్రెస్ (Congress) అర్ధ శతాబ్దపు పాలనంతా మోసం, వంచన, ద్రోహం, దోఖాలమయమని విమర్శించారు. కల్లబొల్లి గ్యారెంటీలు తెలంగాణలో చెల్లవని చెప్పారు. కాంగ్రెస్ కపట కథలు తెలివైన తెలంగాణ (Telangana) ప్రజలకు తెలుసని అన్నారు. రాబందుల రాజ్యమొస్తే రైతుబంధు రద్దవడం గ్యారెంటీ అని విమర్శించారు.

ktr meeting with maharashtra representatives of real estate

కాలకేయుల కాలం వస్తే కరెంట్‌ కోతలు.. కటిక చీకట్లు గ్యారెంటీ అంటూ సెటైర్లు వేశారు కేటీఆర్. మూడు రంగుల ఊసరవెల్లిని నమ్మితే మూడు గంటల కరెంటే గతి.. ఉచిత విద్యుత్ ఊడగొట్టడం గ్యారెంటీ అని మండిపడ్డారు. ‘‘దగాకోరుల పాలనొస్తే ధరణి రక్షణ ఎగిరిపోవడం గ్యారెంటీ. బకాసురులు గద్దెనెక్కితే రైతుబీమా.. ధీమా గల్లంతవ్వడం గ్యారెంటీ. సమర్థత లేని సన్నాసులకు ఓటేస్తే సకల రంగాల్లో సంక్షోభం గ్యారెంటీ’’ అంటూ చురకలంటించారు.

‘‘ఢిల్లీ కీలుబొమ్మలు కుర్చీఎక్కితే ఆత్మగౌరవాన్ని అంగట్లో తాకట్టు పెట్టడం గ్యారెంటీ. దొంగల చేతికి తాళాలు ఇస్తే సంపదనంతా స్వాహా చేయడం గ్యారెంటీ. భస్మాసుర హస్తాన్ని నెత్తిన పెట్టుకుంటే బూడిద మిగలడం గ్యారెంటీ. స్కాముల పార్టీకి స్వాగతం చెబితే స్కీములన్నీ ఎత్తేయడం గ్యారెంటీ. కర్షకుడి కష్టం తెలియనోళ్లకు సీటిస్తే అన్నదాత ఆగమైపోవడం గ్యారెంటీ. పరిపాలన చేతగాని చేవలేనివాళ్లకు పగ్గాలిస్తే పల్లెపల్లెనా మళ్లీ పల్లేర్లు మొలవడం గ్యారెంటీ’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పనికిమాలిన వాళ్లు పవర్‌ లోకి వస్తే పరిశ్రమలు పారిపోవడం గ్యారెంటీ అని చెప్పిన కేటీఆర్.. బుద్ధికుశలత లేనోళ్లకు చోటిస్తే భూముల ధరలు పడిపోవడం గ్యారెంటీ అని తెలిపారు. విషయం.. విజ్ఞానం లేనోళ్లను విశ్వసిస్తే వికాసం మాయమై వినాశనం గ్యారెంటీ అని.. థర్డ్ గ్రేడ్ నాయకులను నమ్ముకుంటే ప్రథమ స్థానంలో వున్న స్టేట్ అధమ స్థాయికిపోవడం గ్యారెంటీ అని విమర్శలు చేశారు. ‘‘ఆర్థికశాస్త్రం తెలియని అరాచకులకు అవకాశం ఇస్తే ఎకానమీ ఏట్లో గలవడం గ్యారెంటీ. జోకర్లకు..బ్రోకర్లకు పీఠం ఇస్తే పరువు ప్రతిష్ఠలు గంగలో కలవడం గ్యారెంటీ’’ అంటూ కాంగ్రెస్ గ్యారెంటీలపై సెటైర్లు వేశారు కేటీఆర్. అంతేకాదు, ‘‘దాచి.. దాచి దెయ్యాలకు పెట్టేంత ఎడ్డిది కాదు.. నా తెలంగాణ. ఈనగాచి నక్కల పాల్జేసేంత అమాయక నేల కాదు నా తెలంగాణ’’ అంటూ ట్వీట్ చేశారు.

You may also like

Leave a Comment