Telugu News » KTR : పొరపాటు చేస్తే.. వందేళ్లు వెనక్కి..!

KTR : పొరపాటు చేస్తే.. వందేళ్లు వెనక్కి..!

ఇది ట్రైలర్ మాత్రమే.. ఫుల్ మూవీ ముందుందని.. ఆర్టీసీ క్రాస్ రోడ్‌ లో సినిమా చూడడం కాదు.. ప్రతిపక్షాలకు సినిమా చూపెట్టండి అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

by admin
Minister KTR Inaugurates Naini Narsimha Reddy Steel Bridge at Indira Park

విశ్వనగరంగా హైదరాబాద్ (Hyderabad) ఎదగాలంటే కులాలకు, మతాలకు అతీతంగా ఉండాలన్నారు మంత్రి కేటీఆర్ (KTR). హైదరాబాద్ ఇందిరాపార్క్ నుంచి వీఎస్టీ వరకు రూ.450 కోట్లతో నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మహమూద్‌ అలీ, ఎంపీ కేశవరావు, జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి, ఎమ్మెల్యే ముఠాగోపాల్‌ సహా పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై మండిపడ్డారు. హైదరాబాద్ అభివృద్ధి గురించి వివరించారు.

Minister KTR Inaugurates Naini Narsimha Reddy Steel Bridge at Indira Park

గతంలో నగరంలో కర్ఫ్యూలు ఉండేవని.. ఇప్పుడు అలాంటివి లేవన్నారు. పొరపాటు చేస్తే హైదరాబాద్ వందేళ్లు వెనక్కి పోతుందని.. కొంతమంది మతం పేరుతో చిచ్చుపెట్టేలా చేస్తున్నారని ధ్వజమెత్తారు. అటువంటి వారిని పట్టించుకోవద్దన్న ఆయన.. పనిచేసే, పనికొచ్చే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ను హ్యాట్రిక్ సాధించేలా ఆశీర్వదించాలని కోరారు. నాయిని నర్సింహారెడ్డి కార్మిక పక్షపాతిగా, తెలంగాణ తొలి హోంమంత్రిగా పనిచేశారని.. అందుకే, ఈ స్టీల్ బ్రిడ్జికి ఆయన పేరు పెట్టాలని కేసీఆర్ చెప్పారన్నారు.

ట్యాంక్ బండ్‌ ను తీర్చిదిద్దాం, లోయర్, అప్పర్ ట్యాంక్ బండ్‌ ను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని తెలిపారు కేటీఆర్. కులాలకు, మతాలకు అతీతంగా అందరినీ సమానంగా చూసే వ్యక్తి కేసీఆర్ అని పేర్కొన్నారు. ఒకప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్‌ లో అందరం సినిమాలు చూసిన వాళ్ళమే.. విడుదల అయినప్పుడు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యేది అని గుర్తు చేశారు. ఈ బ్రిడ్జి నిర్మాణంతో ఇకపై ట్రాఫిక్ కష్టాలు ఉండవన్నారు. ఇది ట్రైలర్ మాత్రమే.. ఫుల్ మూవీ ముందుందని.. ఆర్టీసీ క్రాస్ రోడ్‌ లో సినిమా చూడడం కాదు.. ప్రతిపక్షాలకు సినిమా చూపెట్టండి అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జీపులో స్టీల్ బ్రిడ్జ్‌ పై కేటీఆర్ ప్రయాణించారు.

స్టీల్ బ్రిడ్జి విశేషాలు

దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద స్టీల్ బ్రిడ్జి ఇది. ఇందిరా పార్క్ నుంచి వీఎస్టీ వరకు మొత్తం 2.62 కిలోమీటర్ల మేర నిర్మించారు. మొత్తం 81 స్తంభాలతో నిర్మించబడింది. రూ.450 కోట్లు వెచ్చించారు. ఎస్‌ఆర్‌డీపీ కింద నగరంలో నిర్మించిన 20వ ఫ్లైఓవర్ ఇది. ఈ బ్రిడ్జి నిర్మాణంతో అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఇందిరా పార్క్ వద్ద ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి.

You may also like

Leave a Comment