ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై తెలంగాణ వ్యాప్తంగా భిన్న వాదనలు జరుగుతున్నాయి. కార్మిక పక్షపాతిగా కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారని.. తమది ప్రజల ప్రభుత్వం అని బీఆర్ఎస్ వర్గాలు ప్రచారం చేసుకుంటున్నాయి. అయితే.. విపక్షాలు మాత్రం దీనిపై విమర్శలు చేస్తున్నాయి. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 9 ఏళ్లు ఏం చేశారని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ ఎన్నికల డ్రామాగా ఆయన అభివర్ణించారు.
బీజేపీ నేతలు సైతం ఆర్టీసీ విలీనం ఎన్నికల స్టంట్ గానే విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ ట్రాప్ లో పడొద్దని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. బుధవారం పీర్జాదిగుడ, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లలో వివిధ కార్యక్రమలకు మంత్రి హాజరయ్యారు. పీర్జాదిగుడ పార్టీ కార్యాలయం దగ్గర కేసీఆర్ చిత్ర పటానికి పాలభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు మల్లారెడ్డి. కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు.
అయితే.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చెయ్యడం ఎన్నికల స్టంటా అని జర్నలిస్టులు ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఆయన.. ‘‘అవును ఎన్నికల కోసమే అనుకో.. ఏమైనా అనుకో.. కార్మికులు మాత్రం ఎంతో సంతోషిస్తున్నారు’’ అని ఆన్సర్ చేశారు. తమది రాజకీయ పార్టీ అని.. ఎన్నికలకు వెళ్తున్నాం కాబట్టి ఎన్నికల స్టంట్స్ అనేవి ఎలాగైనా ఉంటాయని చెప్పారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలంటే దమ్ము, ధైర్యం కావాలన్న మల్లారెడ్డి.. అది కేసీఆర్ వల్లే సాధ్యమని స్పష్టం చేశారు.
మల్లారెడ్డి కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. మంత్రి అయి ఉండి ఇలా మాట్లాడారు ఏంటని అందరూ అనుకుంటున్నారు. గత నెల 31న కేబినెట్ సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వం. ఈ క్రమంలోనే టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు సిద్ధమైంది.