వైఎస్ షర్మిల(YS Sharmila)పై మంత్రి రోజా(Minister Roja) సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికి మేలు చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్లో షర్మిల చేరారో చెప్పాలని డిమాండ్ చేశారు.
జగన్ను జైలు పాలు చేసిన పార్టీతో షర్మిల చేతులు కలిపారని మంత్రి రోజా విమర్శించారు. తెలంగాణ నుంచి రావాల్సిన రూ.6 వేల కోట్లు, ఉమ్మడి రాష్ట్రంలో ఏపీకి రావాల్సిన రూ. లక్షా 8 వేల కోట్లు రాబట్టాలని షర్మిలకు మంత్రి రోజా సలహా ఇచ్చారు. రాష్ట్ర వాటాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని షర్మిల ప్రశ్నించాలన్నారు.
చంద్రబాబు, పవన్, షర్మిల నాన్ లోకల్ పొలిటీషియన్లు అని విమర్శించారు. 2024 ఎన్నికల తర్వాత వాళ్లంతా తెలంగాణకు పారిపోతారని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి సింహంలాంటి వ్యక్తి అని తెలిపారు. ఎన్నికలకు సింగిల్గానే వెళ్తారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైసీపీదే గెలుపు అని మంత్రి రోజా ధీమా వ్యక్తం చేశారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని జైలు పాలు చేసిన పార్టీతో చేతులు కలిపి అన్యాయం చేశారని మండిపడ్డారు. రాజశేఖర్ రెడ్డి బతికి ఉంటే కాంగ్రెస్ మీద ఉమ్మేసేవాళ్ళు అని చెప్పి… ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని కాంగ్రెస్లో చేరారో చెప్పాలని మంత్రి రోజా డిమాండ్ చేశారు.