మంత్రి సీతక్క(Minister Seethakka) బీజేపీ(BJP), ఆర్ఎస్ఎస్(RSS)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలో పదేళ్లుగా అధికారం చెలాయిస్తున్న బీజేపీ ప్రజలకు చేసిందేమీలేదని ఆరోపించారు. గాంధీని చంపిన గాడ్సే బీజేపీ నాయకుడే అని కీలక వ్యాఖ్యలు చేశారు. గాడ్సే అంటే ఆర్ఎస్ఎస్, ఆర్ఎస్ఎస్ అంటే బీజేపీ అంటూ వ్యాఖ్యానించారు.
ఆర్ఎస్ఎస్ వాళ్లు నేటికీ వారి గద్దెపై జాతీయ జెండాను ఎగురనీయలేదని సంచలన కామెంట్స్ చేశారు. 50ఏళ్లుగా ఇదే పరిస్థితి ఉందన్నారు. మరి జెండా పట్టుకుంటే బ్రిటీష్ వాడు ఎలా చంపేశాడని ప్రశ్నించారు. పైకి మాత్రం తామే దేశభక్తులమని చెబుతున్నారని అన్నారు. బీజేపీ కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తే దళితుల పరిస్థితి దయనీయంగా మారుతుందన్నారు.
రాహుల్ గాంధీకి సొంత ఇల్లు కూడా లేదని మంత్రి సీతక్క వెల్లడించారు. ప్రధాని మోడీ ధరించే సూట్ రూ.16లక్షలు, మేకప్‌నకే ఎక్కువ డబ్బులు ఖర్చవుతాయని ఎద్దేవా చేశారు. బీజేపీ వస్తే రాజ్యాంగం మారుస్తామంటున్నారని, అలా చేస్తే ప్రజల హక్కులు చెరిగిపోతాయన్నారు. రిజర్వేషన్‌లు లేకుండా చేస్తారని సీతక్క గుర్తుచేశారు.
బీజేపీ జీఎస్టీ పెంచడంతో పేదలకు కనీసం కట్టుకోవడానికి బట్టకట్టుకునే పరిస్థితి లేకుండాపోయిందన్నారు. చీరలపై సైతం జీఎస్టీ వేశారంటూ మంత్రి సీతక్క కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఉద్యోగం అడిగితే దేవుడిని చూపిస్తున్నారని, అభివృద్ధిని అడిగితే అయోధ్యను చూపిస్తున్నారంటూ మండిపడ్డారు. తాము మూడు నెలల్లో 34వేల ఉద్యోగాలు ఇచ్చామని మంత్రి సీతక్క చెప్పుకొచ్చారు.