రాహుల్ గాంధీ(Rahul Gandhi) పొర్లు దండాలు పెట్టినా కాంగ్రెస్ పార్టీ(Congress Party) అధికారంలోకి రాదని మంత్రి శ్రీనివాస్ గౌడ్(Minister Srinivas Goud) అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాహుల్ పది సార్లు తెలంగాణలో పర్యటించినా.. పొర్లు దండాలు పెట్టినా.. కాంగ్రెస్ అధికారంలోకి రాదని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను ఎప్పుడూ కుటుంబ పాలన అంటూ విమర్శించే రాహుల్ గాంధీకి ఉన్న అర్హత ఎంటని శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు.
మీరు లీడర్ వా.. రీడర్ వా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి. అసలు రాహుల్‌కు తెలంగాణ చరిత్ర తెలుసా అంటూ ఉద్యమంలో మృతిచెందిన వారు కాంగ్రెస్ వల్ల కాదా? అని మండిపడ్డారు. పదకొండు సార్లు మీకు అధికారం ఇస్తే.. సాగునీరు.. తాగు నీరు ఇవ్వకుండా.. పోటిరెడ్డిపాడు బొక్క కొట్టి.. ఆర్‌డీఎస్ బద్దలు కొట్టి నీళ్ళు దోచుకుపోయారని ఆరోపించారు. పదేళ్లలో దేశంలోనే అత్యధిక జీడీపీ తెలంగాణదేనని తెలిపారు.
ఇప్పుడు బీఆర్ఎస్ మహారాష్ట్రలో విస్తరిస్తుంటే.. మీకు గుబులు పట్టుకుని.. మాపై మాట్లాడుతున్నారా? అంటూ శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. మీ అవసరాలను బట్టి బీసీలు, మైనార్టీలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా అయిన ఎర్ర శేఖర్‌కు టిక్కెట్ జడ్చర్లలో ఇవ్వకుండా.. ఇతరులకు ఇవ్వడంతోనే బీసీలపై మీ కపట ప్రేమ జనం తెలుసుకున్నారని తెలిపారు.
మీరెన్ని రోడ్ షోలు చేసినా.. డ్రామాలు చేసినా జనం నమ్మరు.. కేసీఆర్‌ను కేటీఆర్‌లను తిట్టి పెద్ద నాయకులు అవుతారనుకుంటున్నారా? అంటూ మంత్రి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఎన్ని స్థానాల్లో డిపాజిట్ సాధిస్తుందో చూద్దాం అంటూ సవాల్ విసిరారు. కాంగ్రెస్‌లో డజను మంది సీఎంలు ఉంటారని, పగటి కలలుకంటున్న కాంగ్రెస్ నాయకులను ప్రజలు బొంద పెడతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ మోసాల నుంచి బయట పడి.. ఎంతోమంది నాయకులు బీఆర్ఎస్‌లోకి వస్తున్నారని అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయాన్ని ఎవరూ ఆపలేరని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.