బీఆర్ఎస్(BRS) పాలనలో జరిగిన తప్పిదాలతో తెలంగాణ ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో అప్పులు పెరిగాయని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి(Minister Uttam Kumar Reddy) అన్నారు. ఇవాళ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోలు, బియ్యం, సేకరణ, బియ్యం సరఫరా వంటి కీలక అంశాలపై ఉన్నతాధికారులతో మాట్లాడారు. అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు.
గత పాలకుల వల్ల పౌరసరఫరాలశాఖలో తప్పిదాలు జరిగాయని, ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు ఉత్తమ్. 1.8 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రజలకు ఉచితంగా ఇస్తున్నామని, కానీ ప్రజలు వాటిని వినియోగించుకుంటున్నారా? లేదా? అనేదానిపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు.
ప్రభుత్వం కిలోకు రూ.39 వెచ్చించి ప్రజలకు ఉచితంగా బియ్యాన్ని అందిస్తుంటే పేదలు తినకపోతే ఉచిత బియ్యం పథకం నిరుపయోగమవుతుందన్నారు. రాష్ట్రంలోని అన్ని శాఖల్లో ఆర్థిక పరిస్థితి బాగోలేదని, అన్ని అప్పుల్లో ఉన్నాయని వెల్లడించారు. తొమ్మిదిన్నర ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో లోపాలు ఉన్నాయని తెలిపారు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ ఉందని తెలిపారు. సీఎం దృష్టికి ఆ విషయాన్ని తీసుకువెళ్తానని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి చెప్పారు.
మరోవైపు, కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఆరు గ్యారంటీల్లో రెండు పథకాలైన ‘మహాలక్ష్మి’, ‘ఆరోగ్యశ్రీ’ పథకాలను ప్రారంభించిన సర్కార్ మరో పథకంపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఆరు గ్యారంటీల్లో ఒకటైన ‘రూ.500కే గ్యాస్ సిలిండర్’ అమలుపై పేదలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆరు గ్యారెంటీలను 100 రోజుల్లోగా అమలు చేస్తామంటున్నారు కాంగ్రెస్ నేతలు.