ఐపీఎల్ 2024(IPL-2024) ఆరంభానికి సమయం దగ్గర పడుతోంది. చెన్నె తమ తొలి మ్యాచ్‌లో మార్చి 22న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో చిదంబరం స్టేడియంలో తలపడనుంది. ఈ నేపథ్యంలో డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ షాక్ తగిలింది.
చెన్నై స్టార్ ఓపెనర్, న్యూజిలాండ్ క్రికెటర్ డెవాన్ కాన్వే(Devon Conway) గాయం కారణంగా ఐపీఎల్ 17 సీజన్ మొత్తానికి దూరం కానున్నాడు. అయితే, ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో డెవాన్ కాన్వే ఎడమ చేతి బొటన వేలికి గాయమైంది.
గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడు. ఎడమ బొటన వేలికి శస్త్రచికిత్స అవసరం అని వైద్యులు చెప్పారు. శస్త్రచికిత్స అనంతరం అతడికి ఎనిమిది వారాలు విశ్రాంతి తీసుకోనున్నాడు. ఐపీఎల్ 2023 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించడంలో డెవాన్ కాన్వే పాత్ర కీలకంగా వ్యవహరించాడు.
ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ మ్యాచ్’గా కాన్వే నిలిచాడు. కాన్వే దూరమవడం చెన్నెకి భారీ ఎదురుదెబ్బ అనే చెప్పాలి. గత సీజన్లోనూ 16 మ్యాచ్‌లలో 672 పరుగులు చేశాడు. అందులో ఆరు అర్ధసెంచరీలు ఉన్నాయి. 2022లో మెగా వేలంలో బేస్ ధర రూ.1 కోటికి న్యూజిలాండ్ స్టార్ కాన్వేను చెన్నై తీసుకుంది. 23మ్యాచ్‌లు ఆడిన అతను తొమ్మిది అర్ధ సెంచరీలతో 924 పరుగులు చేశాడు.