Mizorum : మిజోరాం రాజధాని ఐజాల్ సమీపంలోని సాయిరాంగ్ లో బుధవారం నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కూలిపోగా 17 మంది కార్మికులు మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద కొంతమంది చిక్కుకుని ఉండవచ్చునని భావిస్తున్నారు. మృతుల సంఖ్య పెరగవచ్చునని, సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రమాద స్థలం వద్ద 35 నుంచి 40 మంది పని చేస్తున్నట్టు తెలిసింది.
ఈ దుర్ఘటనపై మిజోరాం సీఎం జోరంతంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ రైల్వే వంతెన ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు కేంద్రం 2 లక్షల చొప్పున గాయపడినవారికి 50 వేల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ప్రధాని మోడీ తీవ్ర సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు.
రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రైల్వే అధికారులు ప్రమాద స్థలి వద్ద ఉన్నారని, సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని ఆయన తెలిపారు.
మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ తరఫున 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 2 లక్షలు, స్వల్పంగా గాయపడినవారికి 50 వేల చొప్పున ఎక్స్ గ్రేషియాను ఆయన ప్రకటించారు.