– మాయ మాటలతో అధికారంలోకి వచ్చారు
– ఏనాడైనా కాంగ్రెస్ వాళ్లు చెక్ డ్యామ్ లు కట్టారా?
– బీఆర్ఎస్ పాలనలో ఏ పథకం ఆగలేదు
– కరోనా ఉన్నా కూడా రైతు బంధు డబ్బులు వేశాం
– రైతు బీమా దండగని కాంగ్రెస్ వాళ్లు మాట్లాడటం సిగ్గుచేటు
– ప్రభుత్వంపై హరీష్ రావు విమర్శలు
కాంగ్రెస్ వాళ్లు అసెంబ్లీలో అన్నీ జూటా మాటలు మాట్లాడారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ వాళ్లు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని తెలిపారు. హైదరాబాద్ కు గోదావరి జలాలు తీసుకు వచ్చి మెదక్ జిల్లాకు సింగూరు జలాలు ఇచ్చామని వెల్లడించారు. ఎప్పుడైనా కాంగ్రెస్ వాళ్లు చెక్ డ్యామ్ లు కట్టారా? అని ప్రశ్నించారు.
మెదక్ పట్టణంలో వైస్రాయ్ గార్డెన్స్ లో మెదక్, హవేలీ ఘనపూర్ మండలాల బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరై మాట్లాడుతూ.. మెదక్ పార్లమెంట్ పరిధిలో ఆరు స్థానాలను గెలిచామని తెలిపారు. మెదక్ లో బీఆర్ఎస్ ఓటమి చెందడం దురదృష్టకమన్నారు. తక్కువ మెజార్టీతోనే మెదక్ లో ఓడిపోయామని చెప్పారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో తాను వచ్చి పనిచేసి మరి గెలిపిస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో కష్టపడి పని చేశారని కార్యకర్తలను అభినందించారు. కృతజ్ఞతలు చెప్పాలనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు. 20 గంటల కరెంట్ బీఆర్ఎస్ ఇచ్చిందని అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్లే చెప్పారన్నారు. కాళేశ్వరం, కొండపోచమ్మల ద్వారా సాగునీరు ఇచ్చామన్నారు. కేసీఆర్ అంటే నమ్మకం.. బీఆర్ఎస్ అంటే విశ్వాసమని పేర్కొన్నారు హరీష్ రావు.
కరోనా వచ్చినా రైతులకు రైతుబంధు వేశామన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఏ ప్రభుత్వ పథకం ఆగలేదని వెల్లడించారు. రైతు బీమా దండగ అంటూ అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్లు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. తెలంగాణ కోసం తాను మెదక్ జైల్లో మూడు రోజులున్నానని గుర్తు చేశారు. సోషల్ మీడియాలో అసత్య వార్తలతో బీఆర్ఎస్ పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
మీకు ఏ కష్టమొచ్చినా గంటలో మీ ముందుంటానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రజా క్షేత్రంలో కొట్లాడుదామని పిలుపునిచ్చారు. తెలంగాణతో బీఆర్ఎస్ ది పేగుబంధమని.. పార్లమెంట్ ఎన్నికల్లో మన సత్తా ఏంటో చూపిద్దామని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సారి మెదక్ ఎంపీ బీఆర్ఎస్ గెలవడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. ఎవరు అధైర్య పడవద్దని భవిష్యత్ మనదేనన్నారు హరీష్ రావు.