కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత(Cantonment BRS MLA Lasya Nandita) రోడ్డు ప్రమాదం(Road Accident)లో మృతిచెందడం రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చింది. పటాన్ చెరు సమీపంలో ఓఆర్ఆర్(ORR)పై ఆమె ప్రయాణిస్తోన్న కారు ప్రమాదానికి గురైంది. దీంతో ఎమ్మెల్యే లాస్య నందిత తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందారు.
కాగా, ఎమ్మెల్యేగా ఎన్నికైన కేవలం రెండు నెలల్లోనే లాస్య మృతి చెందడంతో బీఆర్ఎస్ వర్గాలు దిగ్ర్భాంతిని వ్యక్తం చేస్తున్నాయి. అయితే, ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి లాస్య నందితను మృత్యువు వెంటాడుతోంది. ఇప్పటికే ఆమె రెండు సార్లు ప్రమాదబారిన పడ్డారు. గత నెలలో బోయిన్ పల్లిలోని ఓ ఆసుపత్రిలో లాస్య లిఫ్ట్‌లో చిక్కుకుపోయారు. దీంతో ఆ లిఫ్ట్‌ను బద్దలుకొట్టి ఆమెను బయటకు తీశారు. అప్పుడు లాస్యనందిత స్వల్పగాయాలతో బయటపడ్డారు.
అదేవిధంగా ఈ నెల 13వ తేదీన లాస్య నందిత మరో ప్రమాదానికి గురయ్యారు. ఆరోజు బీఆర్ఎస్ నల్లగొండలో భారీ బహిరంగా సభ నిర్వహించింది. ఈ సభకు హాజరై తిరిగి హైదరాబాద్ వస్తుండగా లాస్య కారు నార్కట్‌పల్లి వద్ద ప్రమాదానికి గురికాగా ఆమె స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో ఓ హోంగార్డు మృతిచెందాడు. అయితే, మూడోసారి మాత్రం లాస్యనందితను మృత్యువు వదిలిపెట్టలేదు.
ఇవాళ తెల్లవారుజామున ఓఆర్ఆర్‌పై అతి వేగంగా దూసుకెళ్లిన ఆమె కారు అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. దీంతో లాస్య నందిత అక్కడికక్కడే మృతిచెందారు. దీంతో ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. దివంగత కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కూతురే లాస్య నందిత. గతేడాది ఫిబ్రవరి 19వ తేదీన సాయన్న అనారోగ్యంతో మృతి చెందారు. ఏడాది వ్యవధిలోనే తండ్రీకూతురు మృతిచెందడంతో కంటోన్మెంట్‌లో విషాదం నెలకొంది.