శ్రీరామనవమి(Sri Ramanavami) సందర్భంగా నిర్వహించే శోభాయాత్ర(Shobayatra)లో పోలీసులు అత్యుత్సాహం చూపిస్తే సహించేది లేదని బీజేపీ(BJP) గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (mla Rajasingh)అన్నారు. ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా బుధవారం నగరంలో శ్రీరామ భక్తులు ఘనంగా శోభాయాత్ర నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు.
ఈ సందర్భంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మంగళవారం శోభాయాత్రపై స్పందించారు. ప్రతియేటా శోభాయాత్రలో పోలీసుల వల్లే ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అన్నారు.ఈ సారి ఏ ఒక్క రామభక్తుడిపై పోలీసుల లాఠీ దెబ్బ పడకుండా చూసుకోవాలని సిటి కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డికి రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. 2010 నుంచి శ్రీరామ నవమి రోజున శోభాయాత్ర నిర్వహిస్తున్నామన్నారు. అయితే, యాత్ర కొనసాగే కొన్ని ప్రాంతాల్లో పోలీసులే కావాలని రామభక్తులను తోయడంతో పాటు లాఠీలతో కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో కొత్త కమిషనర్ ఉన్నారని.. అందువల్ల శోభాయాత్రలో రామభక్తులపై పోలీసుల లాఠీ దెబ్బపడకుండా చూసుకోవాలని కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు.