కేసీఆర్ (KCR)ను అసభ్య పదజాలంతో దూషించిన రేవంత్ రెడ్డి (Revanth Reddy)పై పోలీసులు కేసు నమోదు చేయాలని, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ (BRS MLC) కవిత (Kavitha) డిమాండ్ చేశారు. లేకుంటే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. కాంగ్రెస్ (Congress) పార్టీ మెడలు వంచి తెలంగాణ సాధించిన కేసీఆర్ ను చిన్న చూపు చూస్తూ, అవమానపరచడం తగదని సూచించారు.
మాజీ ఎమ్మెల్యే, బాల్క సుమన్‌పై ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని ఆరోపించారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి విధానాలనే.. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తోందని మండిపడ్డారు. ఢిల్లీ రిమోట్ కంట్రోల్ పాలన తెలంగాణ (Telangana)లో రాచరిక వ్యవస్థను తలపిస్తోందని విమర్శించారు. ఈ మేరకు ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.
బీఆర్ఎస్ అధినేతపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని పేర్కొన్న కవిత.. సూర్యునిపై ఉమ్మేస్తే అది తిరిగి మీ మీదే పడుతుందన్న విషయాన్ని మర్చిపోవద్దని విమర్శించారు. మరోవైపు ఈ మధ్య కాలంలో తరచుగా కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడటం కనిపిస్తోంది. కేసీఆర్ కుటుంబంపై ఏడుస్తున్న రేవంత్ రెడ్డి 22 కుటుంబాలకు కాంగ్రెస్ టికెట్లు ఎలా ఇచ్చారంటూ మూడు రోజుల క్రితం తీవ్ర ఆరోపణలు చేశారు.
శిశుపాలుడి వంద పాపాలు పండినట్లుగా వందరోజులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసే తప్పులు పండుతాయని, అప్పుడు ప్రజాక్షేత్రంలో తప్పకుండా నిలదీస్తామని తెలిపారు. కానీ గత 60 రోజులుగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీగా తమపై ఉందని పేర్కొన్నారు.