దేశంలో మహిళా రిజర్వేషన్ల చట్టం తక్షణ అమలుకు భారత్ జాగృతి(Bharat Jagruthi) తరఫున న్యాయపోరాటానికి సిద్ధమని భారత్ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత(Mlc Kavitha) అన్నారు. ఈ మేరకు రిజర్వేషన్ అమలు విషయమై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని చెప్పారు. వారి సలహా మేరకు సుప్రీం కోర్టు(Supreme Court) లో ఈ అంశంపై పెండింగ్‌లో ఉన్న పిటిషన్లో ఇంప్లీడ్ అవుతామని కవిత ప్రకటించారు.
మహిళా రిజర్వేషన్ల కోసం పోరాటం చేసి సాధించిన తాము వాటిని తక్షణమే అమలు చేయించడానికి కూడా మరో పోరాటానికి సిద్ధమయ్యామని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని తక్షణ అమలు కోసం పలు రాజకీయ పార్టీలు, సంస్థలు డిమాండ్ చేస్తున్నాయని గుర్తు చేశారు. ఇప్పటికే పలు పార్టీలు, సంస్థలు కోర్టుకు వెళ్లాయని ప్రస్తావించారు.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సానుకూలంగా స్పందించాలని, 2024 సార్వత్రిక ఎన్నికల నుంచి రిజర్వేషన్లు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కవిత డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్‌పై సుప్రీం కోర్టు విచారణ జరుపుతున్న నేపథ్యంలో న్యాయపరమైన అంశాలను చర్చించి ఆ చట్టాన్ని త్వరగా అమలు చేసేలా పోరాటం చేయనున్నట్లు వెల్లడించారు.
మహిళా రిజర్వేషన్ల కోసం తాము ఢిల్లీలో చేసిన పోరాటానికి దిగి వచ్చిన కేంద్రం పార్లమెంటులో బిల్లును పాస్ చేసిందని చెప్పారు కవిత. అయితే అది చట్టంగా మారిన తర్వాత కేంద్రం అమలును వాయిదా వేసే కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే తాము న్యాయపోరాటానికి దిగుతామని హెచ్చరించారు.