రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ రాజ్యమా? లేక ఖాకీ రాజ్యమా? అని ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె గురువారం జగిత్యాల జిల్లా(Jagtial District)లో పర్యటించారు. మెట్పల్లి(Metpally)లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలపై అక్రమంగా కేసులు బనాయిస్తూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.
కాంగ్రెస్ పార్టీ(Congress party) అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై అన్యాయంగా అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. జీవన్ రెడ్డి 30 ఏళ్ల అధికారంలో ఎన్నడూ జరగని అభివృద్ధి ఎమ్మెల్యే సంజయ్ పదేళ్లలో చేసి చూపించారన్నారు. జరిగిన అభివృద్ధిని ఓర్వలేక అధికారం మారడంతో అక్రమ కేసులు మొదలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అభివృద్ధిని పక్కనపెట్టి, సాధ్యం కానీ హామీలిచ్చిన కాంగ్రెస్ అధికారం చేజిక్కాక ప్రజలను ముప్పుతప్పలు పెడుతోందన్నారు. జగిత్యాల రూరల్ మండలం హబ్సిపూర్ సర్పంచ్‌పై అక్రమ కేసులు ముమ్మాటికీ కక్ష పూరిత చర్యే అన్నారు. కుట్రలను రాజకీయంగా, చట్టపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. కక్ష పూరిత చర్యలను ప్రజలు తిప్పి కొడతారన్నారు.
అదేవిధంగా, యూనివర్సిటీ భూముల విషయంలో విద్యార్థిని జుట్టు పట్టుకొని లాక్కెళ్తున్న పరిస్థితి ఉందని, ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ తెలంగాణలో లేదని అన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. కార్యకర్తలకు, నాయకులకు పార్టీ అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు.