బీఆర్ఎస్(Brs) అధికారం కోల్పోయాక కాంగ్రెస్ వైఫల్యాలపై దృష్టి సారించింది. ఎప్పటికప్పుడు కాంగ్రెస్(Congress) సర్కార్ తప్పిదాలను ఎత్తిచూపుతూ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వచ్చాక రైతన్నకు కష్టాలు మొదలయ్యాయని చెబుతున్నారు.
అయితే, జగిత్యాల అర్బన్, రూరల్ మండలాలకు చెందిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమం మొదలయ్యే సమయానికి ఆ ప్రాంతంలో కరెంట్ లేదు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కలుగజేసుకొని విద్యుత్ అధికారులకి ఫోన్ చేసి కరెంట్ వచ్చాక కార్యక్రమం మొదలు పెట్టారు. దీనిపై ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా స్పందించారు.
కరెంట్ రాకపోవడంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పలు మార్లు ఫోన్ చేసిన వీడియోను పోస్ట్ చేస్తూ ట్వీట్ చేశారు. ‘అసెంబ్లీలో కరెంట్ కట్.. అధికారిక మీటింగ్‌లో కరెంట్ కట్.. రైతులకు కరెంట్ కట్.. సీనియర్ అయిన జీవన్‌రెడ్డి గారు.. కాసేపు కరెంట్ లేకపోతేనే మీరు అల్లాడిపోతున్నారు.. మీరు స్వయంగా ఫోన్ చేసినా కరెంటు రాని పరిస్థితి.’ అంటూ విమర్శించారు.
మరి కరెంట్ పైనే ఆధారపడి వ్యవసాయం చేసుకుంటున్న రైతులు కరెంట్ లేకపోతే, వారికి ఎంత దుఃఖం ఉంటుందో అర్థం చేసుకోండి. ప్రజల కరెంటు కష్టాలు పట్టనట్టు ప్రభుత్వం నటిస్తోందంటూ దుయ్యబట్టారు. ప్రచారంపై పెట్టే శ్రద్ధ పాలనపై పెట్టమని సీనియర్‌గా మీరైనా ముఖ్యమంత్రి గారికి చెప్పండి అంటూ రాసుకొచ్చారు.