Telugu News » BRS : బీఆర్ఎస్‌ సెంటి మెంట్ కరీంనగర్.. లోక్ సమరం నుంచి గట్టెక్కిస్తుందా..?

BRS : బీఆర్ఎస్‌ సెంటి మెంట్ కరీంనగర్.. లోక్ సమరం నుంచి గట్టెక్కిస్తుందా..?

మార్చి 12వ తేదీన గులాబీ బాస్ పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభలో ఏం మాట్లాడబోతున్నారన్నది రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

by Venu

ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS) ఆక్సిజన్ కోసం ఎదురు చూస్తున్న పార్టీలా మారిందని అంటున్నారు. వెంటిలేటర్ పై ఉన్న పేషెంట్ బ్రతకడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తాడో.. లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) విజయం కోసం కూడా పార్టీ అధిష్టానం అన్ని దారులను వెతుక్కోంటుందని తెలుస్తోంది. ఇందుకోసం బీఆర్ఎస్‌కు సెంటిమెంట్‌గా మారిన కరీంనగర్ (Karimnagar) నుంచి తమ ప్రయాణం మళ్ళీ మొదలు పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక పార్టీ ప్రస్థానంలో కరీంనగర్ బీఆర్ఎస్ కు అడ్డాగా మారింది. 2001లో పార్టీ ఆవిర్భావం తర్వాత.. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కొరకు ఉద్యమానికి ఉపిరి పోసిన సింహగర్జన సభ ఇక్కడే మొదలైంది. నాటి టీఆర్ఎస్‌కు, నేటి బీఆర్ఎస్‌కు పార్టీ చరిత్రలో కరీంనగర్ ఓ మైలురాయిగా మిగిలింది. అదీగాక 2009, డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేసిన తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మలి దశకు ఉపిరి పోసింది కరీంనగర్..

తెలంగాణ సాధనలో భాగంగా కేసీఆర్ (KCR).. సిద్ధిపేట శివార్లలోని రంగధాంపల్లి వద్ద ఆమరణ దీక్షకు సిద్ధమయ్యారు. కరీంనగర్ ఉత్తర తెలంగాణా భవన్ నుంచి సిద్ధిపేటకు బయల్దేరిన కేసిఆర్ ను.. కరీంనగర్ శివార్లలోని అల్గనూరు వద్ద పోలీసుల అరెస్ట్ చేసి ఖమ్మం తరలించారు. ఆసుపత్రిలో కూడా ఆయన ఆమరణ దీక్ష కొనసాగించడం వంటి ఎన్నో కీలక ఘట్టాలకు కరీంనగర్ సాక్షిభూతంగా నిలిచింది.

ఇక కాంగ్రెస్ (Congress) గెలుపుతో రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి ప్రభావం పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఉంటుందని అంచనా వేసింది. పైగా కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ (Modi) హవా.. రామజన్మభూమి కల సాకారం కావడం వారికి తప్పకుండా కలసి వస్తుందని భావిస్తుంది. అదే సమయంలో కాంగ్రెస్ పై కూడా ఈ ప్రభావం పడుతుందని అంచనాకు వచ్చింది..

ఇక బీజేపీ (BJP)ని ఇంటికి పంపాలనే ఆశయంతో ఇండియా పేరిట జట్టు కట్టిన ఇతర మిత్రపక్షాలు పుంజుకోకపోవడంతో.. ప్రస్తుతం బీజేపీ గాలి బలంగా వీస్తోంది. ఒకవైపు బలంగా ఉన్న బీజేపీని ఎదుర్కోవాలన్నా, మరోవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను ఢీకొట్ఠాలన్నా బీఆర్ఎస్ కు అగ్నిపరీక్షలా మారింది. సెంటిమెంట్ రాజకీయాలకు అలవాటుపడిన గులాబీ.. ప్రస్తుతం అవి పనిచేస్తాయా ? లేదా ? అనే డిఫెన్స్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

అయిన ప్రయత్నం చేద్దామని భావించిన బీఆర్ఎస్.. పార్లమెంట్ ఎన్నికల శంఖారావానికి కరీంనగర్‌, ఎస్‌ఆర్ఆర్ మైదానాన్ని ఎంచుకొంది. అయితే మార్చి 12వ తేదీన గులాబీ బాస్ పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభలో ఏం మాట్లాడబోతున్నారన్నది రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో సభను సక్సెస్ చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు నడుం బిగించాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ తదితరులు సభా ఏర్పాట్లు పరిశీలించారు.

మరోవైపు కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో బీజేపీతో ఢీ అంటే ఢీ అనేందుకు సిద్ధపడుతున్నట్టు కనబడుతోంది. ఇక కాంగ్రెస్ తమ అభ్యర్ధి ఎవరో ఇంకా ప్రకటించలేదు.. అందుకే కమలం టార్గెట్ గా ప్రణాళిక రచిస్తోంది. ఈ క్రమంలో సెంటిమెంట్ గా కలిసి వచ్చిన కరీంనగర్.. లోక్ సమరం నుంచి బీఆర్ఎస్ ను గట్టెక్కిస్తుందా? లేక ఆ సెంటిమెంట్ కు అయింట్ మెంట్ పూసి ఇంట్లో కూర్చుండ పెడుతుందా అనే చర్చ ఆసక్తికరంగా మారింది..

You may also like

Leave a Comment