ఎమ్మెల్సీ వంశీ కృష్ణ యాదవ్ (Vamshi Krishna Yadav) వంటి నేతలు రాష్ట్రానికి ఎంతో అవసరం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (PaWan Kalyan)అన్నారు. వంశీ కృష్ణను తాము ఒక నియోజకవర్గంలా చూడటం లేదన్నారు. వంశీ కృష్ణ ఏ నమ్మకంతోనైతే జనసేనలోకి వచ్చారో ఆ నమ్మకం కోల్పోకుండా జనసేన చూసుకుంటుందని తెలిపారు. వంశీకి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు.
వైసీపీ ఎమ్మెల్సీ వంశీ కృష్ణ యాదవ్ జనసేన తీర్థం పుచ్చుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన జనసేన కండువా కప్పుకున్నారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ…. వంశీ కృష్ణ యాదవ్ ఉత్తరాంధ్రలో బలమైన నాయకులన్నారు. వంశీకృష్ణ యాదవ్‌తో తనకు 2009 నుంచి పరిచయం ఉందన్నారు. యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి యంగ్ లీడర్‌గా వంశీ పని చేయడం చూశానన్నారు.
మళ్లీ ఇప్పుడు 2023లో ఎమ్మెల్సీ హోదాలో జనసేనలో చేరిన వంశీకృష్ణను తాను మనస్పూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా వంశీ రెండు సార్లు స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారని అన్నారు. కానీ పట్టుబట్టి ఎమ్మెల్సీగా ఆయన విజయం సాధించారని వెల్లడించారు. వైసీపీ పాలన గురించి కాకుండా జనసేన సిద్దాంతాలను నమ్మి వచ్చానని వంశీ యాదవ్ చెప్పారన్నారు.
జనసేనలోకి రావడం తన సొంత ఇంటికి వచ్చినట్లుగా ఉందని వంశీకృష్ణ చెప్పడం ఆనందం కలిగించిందన్నారు. వంశీ కృష్ణ కేవలం ఒక నియోజకవర్గానికే పరిమితం కాకుండా, రాష్ట్ర నాయకుడిగా ఎదగాలన్నారు. ఆయనకు మంచి భవిష్యత్ అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ వ్యవహారం మొత్తం ఒక క్రమంలో నడిపిన పీఎసీ ఛైర్మన్ మనోహర్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.