సెల్‌ఫోన్(Mobile Phone) పేలి నలుగురు చిన్నారులు మృతిచెందారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ (UP)లోని పల్లవపురం(Pallavapuram) పరిధి జనతా కాలనీ(Janatha Colony)లో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జనతా కాలనీలో నివాసముంటున్న జానీ, బబిత కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
వీరికి నలుగురు పిల్లలు సారిక (12), నిహారిక (8), గోలు(6), కల్లు (5) ఉన్నారు. శనివారం సాయంత్రం గదిలో పిల్లలు ఆడుకుంటూ, మొబైల్ ఛార్జర్‌ను ఎలక్ట్రికల్ బోర్డులో పెట్టారు. ఈ సమయంలో షార్ట్ సర్క్యూట్ సంభవించింది. ఈ క్రమంలో మొబైల్ ఫోన్ పేలిపోయింది. మంటలు చెలరేగి మంచానికి అంటుకోవడంతో నలుగురు చిన్నారులు సారిక, నిహారిక, గోలు, కల్లు తీవ్ర గాయాలపాలయ్యారు.
ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వారిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. అయితే నలుగురు చిన్నారులు చికిత్స పొందుతూ మృతిచెందారు. తండ్రి జానీ పరిస్థితి విషమంగా ఉంది. తల్లి బబితకు 60శాతం గాయాలయ్యాయి. ఆమెను ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మొబైల్ కు చార్జింగ్ పెడుతున్న సమయంలో మంటలు చెలరేగాయని జానీ పోలీసులకు తెలిపాడు.
ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మొబైల్స్ చార్జింగ్ పెట్టే సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఈ ఘటన మరోసారి సూచించింది. మరోవైపు మొబైల్స్ చార్జింగ్ పెట్టి ఫోన్లు మాట్లాడడం సరైంది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.