Telugu News » Students Protest : మాకు దిక్కెవరు..? ఇదేనా బంగారు తెలంగాణ?

Students Protest : మాకు దిక్కెవరు..? ఇదేనా బంగారు తెలంగాణ?

కనీసం హాస్టల్లో తాగునీరు కూడా సరిగ్గా లేదని.. దోమలతో ఇబ్బంది పడుతున్నామని వివరించారు విద్యార్థినులు.

by admin
Model School Students Protest On Road Over Lack Of Facilities

ఈమధ్య విద్యార్థులు స్కూళ్లలో కంటే రోడ్లపైనే ఎక్కువగా కనిపిస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం రహదారులపై బైఠాయిస్తున్నారు. మొన్న ఆర్టీసీ (RTC) బస్సుల కోసం పటాన్ చెరు గుమ్మడిదలలో ధర్నా చేశారు విద్యార్థినులు. అధికారులు, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపారు. తాజాగా, జగిత్యాల (Jagtial) జిల్లా మల్లాపూర్ లో మోడల్ స్కూల్ (Model School) విద్యార్థినులు రోడ్డెక్కారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలు నెరవేర్చాలని ఆందోళనకు దిగారు.

Model School Students Protest On Road Over Lack Of Facilities

స్కూల్లో, కాలేజీల్లో కనీస సౌకర్యాలు లేవని రోడ్డుపైకి వచ్చి నిరసన చేశారు. ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో ఆరోగ్య సమస్యలు వస్తే చెప్పుకునేందుకు కేర్ టేకర్, ఏఎన్ఎంలు కూడా లేరని వాపోయారు. కనీసం హాస్టల్లో తాగునీరు కూడా సరిగ్గా లేదని.. దోమలతో ఇబ్బంది పడుతున్నామని వివరించారు విద్యార్థినులు. కనీసం జ్వరం, జలుబు, దగ్గు మందులు కూడా అందుబాటులో లేవంటున్నారు.

గత వారం రోజులుగా ఉన్న వార్డెన్ మేడం సెలవు పెట్టి వెళ్లిందని.. రాత్రివేళ భయంతో బిక్కబిక్కుమంటూ గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థినులు. ఎంతో మందికి జ్వరాలు, వైరల్ ఫీవర్స్ వస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. డీఈవో సహా అధికారులకు చెప్పినా ఎవరూ సీరియస్ గా తీసుకోవడం లేదంటున్నారు. చేసేది లేక.. చివరకు ఇలా రోడ్లపైకి వచ్చామంటున్నారు.

తమ సమస్యలను లేఖ ద్వారా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని.. అయినా, స్పందన లేదని విద్యార్థినులు ఆరోపించారు. వీరి ధర్నా విషయం తెలిసి పోలీసులు అక్కడికి చేరుకుని మాట్లాడారు. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు. దీంతో జిల్లా విద్యాధికారులు హుటాహుటిన నలుగురు ఆశా వర్కర్లను సంబంధిత పాఠశాలకు పంపించినట్లుగా సమాచారం.

You may also like

Leave a Comment