లోక్ సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ (BJP) బహిరంగ సభలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) రెండు రోజులు తెలంగాణ (Telangana)లో పర్యటిస్తున్నారు.. నేడు సంగారెడ్డి (Sangareddy) జిల్లా పర్యటనలో ఉన్న ప్రధాని, పటేల్ గూడాలోని ఎస్ఆర్ ఇన్ ఫినిటిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మోడీ.. కేంద్రం రాష్ట్ర అభివృద్దికి కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ దక్షిణ భారతదేశానికి గేట్ వే అని తెలిపారు. దేశవ్యాప్తంగా రూ.56వేల కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టామన్నారు. సంగారెడ్డిలో రూ.9వేల కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నామని తెలిపారు. బేగంపేటలో తొలి సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ ను ప్రారంభించినట్లు వెల్లడించారు.. దేశంలో ఎయిర్ పోర్టుల సంఖ్య పదేళ్లలో రెట్టింపు చేశామని వివరించారు.
వికసిత్ భారత్ దిశగా మా ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న ప్రధాని.. ఘట్ కేసర్-లింగంపల్లి మధ్య ఎంఎంటిఎస్ రైళ్లను ప్రారంభించామని… ఈ ఎంఎంటీఎస్ తో అనేక ప్రాంతాలకు కనెక్టివిటీ పెరుగుతోందని పేర్కొన్నారు. మౌళిక సదుపాయాల కోసం బడ్జెట్ లో రూ.11 లక్షల కోట్లు కేటాయించామని తెలిపారు. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రధాని అన్నారు.
తాను ఇచ్చిన మాట ప్రకారం ఆర్టికల్ 370 రద్దు హామీ అమలు చేశామన్న ప్రధాని.. ప్రపంచం గర్వించే రీతిలో అయోధ్యలో రాముడి ప్రతిష్ఠాపన జరిగిందని తెలిపారు. ఇప్పటికే ప్రపంచానికి భారత్ ఆశాకిరణంలా మారిందని అభివర్ణించారు. ప్రపంచ దేశాల్లో తెలుగు ప్రజలు కీలకభూమిక పోషిస్తున్నారని కితాబు ఇచ్చారు. వారసత్వ రాజకీయాలను వ్యతిరేకిస్తున్నట్లు, కుటుంబ పార్టీల వల్ల ప్రతిభ ఉన్నవారికి అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. అంతేకాకుండా యువతకు అవకాశాలు దొరకట్లేదని ప్రధాని వివరించారు.
అంతకుముందు ఉదయం సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి ఆలయాన్ని ప్రధాని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయం దగ్గర అర్చకులు, అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం మోడీకి ఆశీర్వచనం చేసిన పూజారులు… అమ్మవారి వస్త్రంతో తో పాటు మహంకాళి ఫొటో ఫ్రేమ్ ను బహుకరించారు.