Bricks : దక్షిణాఫ్రికాలో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యేందుకు బయలుదేరేముందు ప్రధాని మోడీ (Modi) ట్వీట్ చేస్తూ జోహాన్నెస్ బెర్గ్ లో తాను కొద్దిమంది నేతలతోనే సమావేశమవుతానని తెలిపారు. గ్లోబల్ సౌత్ ఎదుర్కొంటున్న సవాళ్లపై తాను చర్చిస్తానని ఆయన పేర్కొన్నారు. సౌతాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా ఆహ్వానం మేరకు వెళ్తున్నానని, బ్రిక్స్ సదస్సుతో బాటు బ్రిక్స్-ఆఫ్రికా అవుట్ రీచ్ కార్యక్రమంలో పాల్గొంటానని వెల్లడించారు. వైవిధ్యమైన రంగాల్లో కూటమి దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంపై బ్రిక్స్ కృషి చేస్తున్నదని ఆయన అన్నారు.
బ్రిక్స్ సదస్సుకు ఆహ్వానం పొందిన అతిథులతో చర్చించేందుకు ఎదురుచూస్తున్నానన్నారు. కాగా చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ జోహాన్నెస్ బెర్గ్ చేరుకున్నారు. సౌతాఫ్రికా కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం ఆయన జొహాన్నెస్ బెర్గ్ చేరుకున్నారు. ఈ సదస్సులో మోడీ, జిన్ పింగ్ భేటీ అవుతారా అన్నది ఆసక్తికరంగా మారిందంటూ కొన్ని పత్రికలు పేర్కొన్నాయి.
వీరిద్దరి ద్వైపాక్షిక భేటీ ఉంటుందా అన్నదానిపై భారత విదేశాంగ శాఖ క్లారిటీ ఇవ్వలేదు. వీరి సమావేశానికి సంబంధించిన వివరాలు ఇంకా ఖరారు కాలేదని ఈ శాఖ కార్యదర్శి వినయ్ కాత్రా నిన్న చెప్పారు.
ఇక బ్రిక్స్ సమ్మిట్ కి హాజరయిన అనంతరం మోడీ ఈ నెల 25 న గ్రీస్ వెళ్లనున్నారు. ఆ దేశ ప్రధాని కిరియాకోస్ మిట్సోటకీస్ ఆహ్వానం మేరకు తాను అక్కడికి వెళ్తున్నట్టు పేర్కొన్న మోడీ.. ఈ పురాతన సంస్కృతి కలిగిన దేశానికి 40 ఏళ్ళ తరువాత వెళ్తున్న భారత తొలి ప్రధానిని తానేనని వెల్లడించారు. భారత-గ్రీస్ దేశాల మధ్య వివిధ రంగాల్లో సంబంధాలు మరింత బలోపేతం కావలసి ఉందని మోడీ పేర్కొన్నారు.