Modi : ఇస్రో హీరోలకు నా సెల్యూట్ అన్నారు ప్రధాని మోడీ (Modi). చంద్రయాన్-3 (Chandrayann-3) విజయవంతమైన నేపథ్యంలో శనివారం ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించేందుకు ఆయన గ్రీస్ నుంచి నేరుగా బెంగళూరు చేరుకున్నారు. ఈ సందర్బంగా భావోద్వేగంతో మాట్లాడిన మోడీ.. మీరు మన దేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటారని అన్నారు. ఈ విజయం మనకెంతో గర్వకారణం. చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ సమయంలో దక్షిణాఫ్రికాలో ఉన్నా.. , కానీ అక్కడ ఉన్నా మనసంతా చంద్రయాన్-3 విజయంపైనే ఉంది. ..ఈ విజయానికి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా..ఇది అసాధారణ విజయం. చంద్రునిపై భారత్ అడుగు పెట్టింది’ అని అభివర్ణించారు. ఇప్పుడు భారత్ చంద్రునిపై ఉందని, గతంలో ఎవరూ చేయలేనిది మీరు చేసి చూపారని ఆయన అన్నారు.
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఇండియా దూసుకువెళ్తోందని, ప్రపంచానికే దిక్సూచిగా మారుతోందని ఆయన చెప్పారు. ఈ కృషిలో మహిళా శాస్త్రవేత్తల అద్భుత ప్రమేయం కూడా ఉండడం గర్వకారణమన్నారు. చంద్రయాన్-3 ల్యాండర్ చంద్రునిపై టచ్ చేసిన ప్రాంతాన్ని ‘శివ్ శక్తి’ గా వ్యవహరిద్దామని ఆయన చెప్పారు. అలాగే ఆగస్టు 23 న నేషనల్ స్పేస్ డే’ (జాతీయ అంతరిక్ష దినం) గా ఆయన ప్రకటించారు. చంద్రయాన్-2 చంద్రునిపై తన ఫుట్ ప్రింట్స్ ను వదలిన చోటును ‘తిరంగా’ అని వ్యవహరిద్దామని చెప్పిన మోడీ.. ఇండియా చేసిన ప్రతి పనికీ ఇది ప్రేరణ కాగలదన్నారు.
ఇస్రో చైర్మన్ సోమనాథ్ ను ఆయన హగ్ చేసుకున్నారు. ఇస్రో శాస్త్రవేత్తలకు ల్యాండర్ విక్రమ్ రెప్లికాలను ఆయన బహుకరించారు. భారత స్పేస్ ఇండస్ట్రీ మరికొన్నేళ్లలో 8 బిలియన్ డాలర్ల నుంచి 16 బిలియన్ డాలర్లను సముపార్జిస్తుందనడంలో సందేహం లేదన్నారు.
అంతకుముందు పీన్య లోని ఇస్రో కేంద్రంలో మోడీకి చంద్రయాన్-3 ప్రయోగం తీరును ఇస్రో చైర్మన్ సోమనాథ్ వివరించారు. మొదట హెచ్ఏఎల్ విమానాశ్రయం వద్ద మోడీ.. ‘జై విజ్ఞాన్.. జై అనుసంధాన్’ నినాదం చేశారు. ఆయన కాన్వాయ్ సాగుతుండగా ప్రజలు రోడ్డుకు రెండువైపులా నిలబడి హర్షధ్వానాలతో ఆయన స్వాగతం చెప్పారు.