Modi : దేశంలో వరుస బాంబు పేలుళ్ల శకం ముగిసిందని ప్రధాని మోడీ (Modi) అన్నారు. ఇప్పుడు దేశం సుస్థిర ప్రభుత్వంతో ముందుకు సాగుతోందని, ప్రభుత్వం చేబట్టిన సంస్కరణలు మంచి ఫలితాలనిస్తున్నాయని చెప్పారు. ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. వారు ఆశించిన ఫలాలను అందిస్తున్నాం.. అన్నారు. దేశ 77 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం ఢిల్లీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయని, ఐదేళ్లలో ఇండియా బలమైన ఆర్ధిక వ్యవస్థలున్న దేశాల్లో మూడో స్థానాన్ని ఆక్రమిస్తుందని ఆయన అన్నారు.
2014 లో తాము అధికారంలోకి వచ్చినప్పుడు దేశం పదో స్థానంలో ఉందని కానీ ఇప్పుడు ఐదో స్థానంలో నిలిచామని చెప్పారు. 140 కోట్లమంది భారత ప్రజలు తమ ప్రభుత్వంపై ప్రగాఢ విశ్వాసం ఉంచిన ఫలితమే ఇదన్నారు. అవినీతి కబంధ హస్తాల నుంచి ఈ దేశానికి విముక్తి కల్పించామని, లీకేజీలకు అడ్డుకట్ట వేసి పటిష్టమైన ఎకానమీకి బాటలు పరిచామని మోడీ పేర్కొన్నారు. ‘రీఫామ్, పర్ఫామ్, ట్రాన్స్ ఫామ్’ అన్న మూడు సూత్రాలు దేశ స్థితిగతులను మార్చివేశాయని చెప్పారు. భారత దేశ సత్తాను ప్రపంచ దేశాలు గుర్తించాయని, నేడు జీ 20 కూటమికి ఇండియా అధ్యక్షత వహించే అవకాశం లభించిందని చెప్పిన ఆయన.. దేశంలోని ప్రతి మారుమూల రాష్ట్రంలోనూ జీ 20 ఈవెంట్ల నిర్వహణను ప్రపంచం చూస్తోందన్నారు.
ఇండియాలో యువశక్తికి అపార అవకాశాలున్నాయని పేర్కొన్న మోడీ.. ట్రినిటీ ఆఫ్ డెమోగ్రాఫీ, డెమాక్రసీ, డైవర్సిటీ అన్న పదాలను ప్రస్తావిస్తూ దేశ ప్రజల కలలను సాకారం చేసేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.
మణిపూర్ కు అండగా ఉంటాం
ఈ దేశ ప్రజలు మణిపూర్ కు అండగా ఉంటారని, ఆ రాష్ట్రంలో శాంతి నెలకొనేలా చూసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని మోడీ చెప్పారు. మణిపూర్ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు కేంద్రం, ఆ రాష్ట్రం కూడా కృషి చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు తమ సర్కార్ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయన్నారు. సాంప్రదాయక నైపుణ్యం గలవారి కోసం మా ప్రభుత్వం వచ్చే నెలలో ‘విశ్వకర్మ’ పథకాన్ని చేబడుతుందని ప్రకటించిన ఆయన., ఇందుకు 13 వేల కోట్ల నుంచి 15 వేల కోట్లను కేటాయిస్తామని వెల్లడించారు.
కరోనా భూతం ప్రపంచాన్ని వదలలేదు
కరోనా మహమ్మారినుంచి ప్రపంచం ఇంకా కోలుకోలేదని మోడీ పేర్కొన్నారు. కానీ ఇండియా ఈ బెడదను అధిగమించిందన్నారు. కోవిడ్ పాండమిక్ సమయంలో తాము 200 కోట్ల వ్యాక్సినేషన్లను ఇప్పించామన్నారు. సైన్స్, టెక్నాలజీలో మనం దూసుకుపోతున్నామని, మా ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యలు, చేబట్టిన పథకాలు వచ్చే వెయ్యేళ్ళ వరకు మంచి ప్రభావాన్ని చూపుతాయని అన్నారు.
పునరుత్పాదక శక్తికి సంబంధించి మన లక్ష్యాలను చేరుకోగలిగామని మోడీ చెప్పారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని తాను గట్టిగా విశ్వసిస్తున్నానని పేర్కొన్నారు. మొదట రాజ్ ఘాట్ లో మహాత్మా గాంధీకి నివాళులర్పించిన మోడీ త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. రాజస్థానీ స్టయిల్ తలపాగా ధరించిన మోడీ అశోక్ చక్ర చిహ్నంతో కూడిన బ్లాక్ నెహ్రూ జాకెట్
ను ధరించారు.