అయోధ్య (Ayodhya)లో ‘రామ్ లల్లా’ (Ram Lalla)ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రధాని మోడీ చేతుల మీదుగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో 11 రోజుల కఠినమైన దీక్ష చేపడుతున్నట్టు గత శుక్రవారం ప్రధాని మోడీ వెల్లడించారు. అప్పటి నుంచి దీక్షలో భాగంగా కఠినమైన నియమాలను ప్రధాని పాటిస్తున్నారు. ప్రతి రోజూ నేలపైనే పడుకుంటున్నారు. ఉపవాసం చేస్తున్న ప్రధాని మోడీ కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతున్నారని సమాచారం.
ప్రధాని మోడీ 11 రోజుల పాటు ‘యమ్ నియమం’ను పాటిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. హిందూ గ్రంథాల్లో యమ్ నియమానికి సంబంధించి పేర్కొన్న అన్ని సూచనలను ప్రధాని మోడీ పాటిస్తున్నారని అంటున్నారు. ‘యమ్ నియమం’ పాటించే వాళ్లు యోగా, ధ్యానం, వివిధ అంశాల్లో క్రమశిక్షణతో సహా అనేక కఠినమైన చర్యలను పాటించాల్సి ఉంటుంది.
ప్రధాని మోడీ తన దైనందిన జీవితంలో సూర్యోదయానికి ముందు శుభ సమయంలో మేల్కొలపడం, ధ్యానం, ‘సాత్విక్’ ఆహారం తీసుకోవడం వంటి అనేక విభాగాలను ఇప్పటికే పాటిస్తున్నారని అధికారులు తెలిపారు. ప్రాణప్రతిష్ట అనే పవిత్రమైన కార్యాన్ని నిర్వహించబోతున్న ఆయన తన శరీరాన్ని, ఆత్మను శుద్ది చేసే లక్ష్యంతో ఈ దీక్ష చేపట్టినట్టు సమాచారం.
ఈ దీక్షను అనుసరించే వ్యక్తులు కఠినమైన నియమాలను పాటిస్తూ ఉపవాసం ఉంటారని, ధ్యానంతో శరీరాన్ని, ఆత్మకు శుద్ది చేస్తారని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. ఇక దీక్ష సమయంలో ప్రధాని మోడీ గో పూజ చేస్తున్నారని, గోవులకు ఆహారం అందజేయడం, అన్నదానం వంటి పలు రకాల కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
ఇక రామ భక్తుడైన మోడీ కొన్ని రోజులుగా దేశంలోని పలు ఆలయాలను సందర్శిస్తున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇటీవల మాహారాష్ట్ర నాసిక్‌లోని రామ్‌కుండ్ శ్రీకాల రామ దేవాలయం, ఏపీలోని లేపాక్షిలోని వీరభద్ర ఆలయం, కేరళలోని గురువాయుర్ ఆలయం, త్రిప్రయార్ శ్రీ రామస్వామి దేవాలయాలను దర్శించుకున్నారు. తాజాగా ఈ రోజు తమిళనాడులోని రంగనాథ స్వామి ఆలయాన్ని కూడా ఆయన దర్శించారు.