మన సమైక్యతే మనకు బలమని, సమైక్యంగా లేకపోతే కొన్ని శక్తులు ఈ దేశాన్ని బలహీనపరచేందుకు యత్నిస్తాయని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. మొత్తం ప్రపంచానికే ఇండియా కాంతినివ్వాలని ఆయన పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం బెంగళూరు లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన ఆయన.. ప్రపంచానికి కాంతిని ఇచ్చేందుకే ఇండియా ఇండిపెండెన్స్ సాధించిందని చెప్పారు.
మన జాతీయ జెండాను స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ జెండాలోని కాషాయ రంగు త్యాగాన్ని సూచిస్తే.. తెలుపు రంగు నిస్వార్థాన్ని, ఆకుపచ్చ రంగు సంపదను సూచిస్తుందని ఆయన వివరించారు. భారత్ తన శక్తి సామర్థ్యాలను పెంచుకోవాలని కూడా చెప్పిన ఆయన.. తన సాంస్కృతిక సామర్థ్యం ద్వారా ఈ దేశం ఇతర దేశాలకు మార్గదర్శకం కావాలన్నారు.
మన జాతీయపతాకం ఇస్తున్న స్ఫూర్తితో ఈ సందేశం ఆధారంగా ప్రపంచాన్ని మనం లీడ్ చేయవలసిన అవసరం ఉందని మోహన్ భగవత్ పేర్కొన్నారు. నాలెడ్జ్,యాక్షన్, డివోషన్, ప్యూరిటీ, ప్రాస్పెరిటీ అన్నవి ముఖ్యమని, వీటి ప్రాతిపదిక పైనే వాల్డ్ కి మనం మంచిసందేశాన్ని ఇవ్వవచ్చునని ఆయన చెప్పారు.
భారత్ అంటే భా అన్నది కాంతికి సూచిక అని, సూర్యారాధన మేలు చేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా తమసోమా జ్యోతిర్గమయా అన్న సందేశాన్ని ఆయన ప్రస్తావించారు.