వైసీపీ పాలనలో ఐదేళ్లు అభివృద్ధి పనులు అనుకున్నంతగా జరగలేదని.. అందుకే జనసేనలో చేరుతున్నానని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి(Machilipatnam MP Vallabhaneni Balashauri) అన్నారు. పవన్ కల్యాణ్(Pawan Kalyan) సమక్షంలో ఆదివారం జనసేన(Janasena)లో చేరనున్నట్లు ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీలో అభివృద్ధి గురించి పట్టించుకునే పరిస్థితి లేదని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎన్నిసార్లు చెప్పినా స్పందించలేదన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారన్న ఆలోచనతోనే జనసేనతో కలిసి నడుస్తున్నానని స్పష్టం చేశారు.
అదేవిధంగా వైఎస్సార్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు బాలశౌరి. తాను వైఎస్సార్ అడుగు జాడల్లో నడిచిన వ్యక్తినని తెలిపారు. వైఎస్ ఎంతో గొప్ప వ్యక్తి అని, ఆయనతో ఏ నాయకుడినీ పోల్చలేమన్నారు. 2004లో వైఎస్ శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చానని, గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బందర్ నుంచి పోటీ చేసి గెలిచానన్నారు.
తాను రాజకీయాల్లో క్రమ శిక్షణతో ఉంటాను కాబట్టే ఎవరైనా నచ్చుతానని తెలిపారు. వైఎస్ హయాంలో డెల్టాకు జీవనాధారమైన పులిచింతల ప్రాజెక్టును పూర్తి చేయగలిగామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని భావించామని, అయితే డయాఫం వాల్ రిపేరు పేరుతో రెండు సంవత్సరాలుగా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధులు తెచ్చుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందంటూ అసహనం వ్యక్తం చేశారు. కొన్ని కేంద్ర పథకాలకు మాచింగ్ గ్రాంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని, రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి చూస్తే బాధేస్తోందన్నారు.