కాంగ్రెస్ న్యాయ పత్రం బ్రిటీష్ వారసత్వాన్ని గుర్తు చేస్తోందని రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్(MP Laxman) అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ(BJP) ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో కలిసి ఆయన విడుదల చేశారు. అనంతరం ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ‘న్యాయ పత్రం’ పేరుతో విడుదల చేసిన మేనిఫెస్టోతో విభజన రాజకీయాలు చేస్తున్నట్లు తెలుస్తోందన్నారు.
‘సంకల్ప పత్రం’ పేరుతో తాము విడుదల చేసిన మేనిఫెస్టోలో వికసిత భారత్ కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ప్రజల అభివృద్ధినీ దృష్టిలో పెట్టుకొని, ప్రజాభిప్రాయానికి లోబడి బీజేపీ సంకల్ప పత్రం తయారు చేసిందని చెప్పుకొచ్చారు. రెండు పార్టీల మేనిఫెస్టోలో అర్థాన్నీ ప్రజలే అర్థం చేసుకోవాలని సూచించారు. యూపీఏ గతంలో ఎన్నో కుంభ కోణాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిందని ఆరోపించారు.
ఇప్పుడు అదే యూపీఏ కూటమి పేరు మార్చి ఇండియా కూటమిగా ఏర్పడిందని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు ప్రభుత్వం ఆస్తులను ఎలా దోచుకున్నారో ప్రజలందరికీ తెలుసని దుయ్యబట్టారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో విభజించి పాలించే విధానాలు అందులో కనిపిస్తున్నాయని లక్ష్మణ్ ఆరోపించారు. అందులో ప్రజల సంక్షేమం మచ్చుకైనా కనిపించడంలేదన్నారు. మైనారిటీ ముసుగులో మెజారిటీ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా పని చేస్తోందన్నారు.
తెలంగాణాలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ లా పేరుతో మోసం చేసిందన్నారు. ఇప్పుడు రాహుల్ ప్రధాని అయితే గ్యారెంటీలు నెరవేరుతాయని ముడి పెడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణాలో మహిళలకు ఇస్తానన్న రూ.4వేల ఆర్థిక సాయంతో పాటు రూ.లక్ష ఎలా ఇస్తారనేది ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఇవి ఆచరణకు సాధ్యంకాని హామీలని ఎంపీ లక్ష్మణ్ స్పష్టం చేశారు.