ప్రశ్నలు అడిగినందుకు డబ్బులు తీసుకున్నారనే వ్యవహారంలో(Cash For Question Case) తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా(MP Mahua Moitra) లోక్‌సభ(Lok Sabha) నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఈ మేరకు ఎథిక్స్ కమిటీ(Ethics Committee) సిఫారసు చేయగా లోక్‌సభ ఆమోదం తెలిపింది. మహువా మొయిత్రాను సస్పెండ్ చేయాలని పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ తన రిపోర్టులో పేర్కొన్న విషయం తెలిసిందే.
అయితే ఇవాళ(శుక్రవారం) లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఆ రిపోర్టుపై చర్చ జరిగింది. మొయిత్ర తీవ్రమైన అపరాధానికి పాల్పడ్డారని, ఆమెకు కఠిన శిక్ష వేయాలని రిపోర్టులో సూచించారు. ఈ మేరకు ‘ఎంపీ మహువా అనైతికంగా, అమర్యాదకరంగా ప్రవర్తించారని కమిటీ చేసిన తీర్మానాన్ని ఈ సభ అంగీకరించింది. అందువల్ల ఆమె ఇక ఎంపీగా కొనసాగడం తగదు’ అని స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. మహువా లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఆమెను సభ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.
అంతకుముందు వ్యాపారవేత్త హీరానందనిని ప్రశ్నించలేదని, తన డిమాండ్‌కు న్యాయం చేయాలని ఎంపీ కళ్యాణ్ కోరారు. అసలు మహువా ఎంత క్యాష్ తీసుకుందో విచారణలో తేలిందా, దానికి ఆధారాలు ఏమి ఉన్నాయని ఆయన ప్రశ్నించారు. స్పీకర్‌కు కానీ, మరెవరికి కానీ ఓ సభ్యురాలిని తొలగించే అధికారం లేదని బెనర్జీ అన్నారు. సస్పెండ్ చేసే అధికారం ఉన్నా.. సభ్యురాలిని తొలగించే అధికారం లేదని ఆయన తెలిపారు.
ఎంపీ మహువా రూల్స్‌ను బ్రేక్ చేసినట్లు బీజేపీ ఎంపీ హీనా గవిత్ తెలిపారు. ఇది ప్రభుత్వం, విపక్షం మధ్య వార్ కాదు అని, ఇది లోక్‌సభ హుందాతనానికి చెందిన అంశమని హీనా అన్నారు. పార్లమెంట్ సభ్యులు అందరూ తమ ఐడీలు, పాస్‌వర్డ్‌లను ఎవరితో షేర్ చేయమని పోర్టల్‌లో సంతకం చేయాలన్నారు. ఈ ఘటన మన పార్లమెంట్‌కు మచ్చ తీసుకువచ్చినట్లు ఆమె ఆరోపించారు.
ఎథిక్స్ కమిటీ రిపోర్టు నేపథ్యంలో రాజకీయ పార్టీలు విప్ జారీ చేయడాన్ని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారి తప్పుపట్టారు. ఏదైనా కేసులో జడ్జికు దిశానిర్దేశం చేసినట్లు ఉంటుందని ఆయన ఆరోపించారు. కమిటీ రిపోర్టుపై అభిప్రాయాలను వ్యక్తం చేసుకునే అవకాశాన్ని మహువాకు ఇవ్వాలని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరీ పేర్కొన్నారు. మహువాపై ఆరోపణలు వచ్చాయని, ఆమెను మాట్లాడనివ్వకుంటే అప్పుడు సభ మనోభావాలు దెబ్బతింటాయని టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ తెలిపారు.
అయితే మొయిత్రాకు ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడే అవకాశం కల్పించలేమని మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. గతంలో ఈ అంశం గురించి సోమనాథ్ చట్టర్జీ క్లియర్ చెప్పినట్లు గుర్తు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ .. కమిటీ ముందు చెప్పుకోవాలి, కానీ సభలో కాదు అని అన్నారు. మహువా మొయిత్రా వాదనలను వినాలన్న డిమాండ్‌ను స్పీకర్ ఓం బిర్లా కూడా నిరాకరించారు.