తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) మూడు నెలల్లో కూలిపోతుందంటూ రాజ్య సభ సాక్షిగా ఎంపీ(MP), వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి.
ఈ నేపథ్యంలో ఆయనపై టీపీసీసీ అధికార ప్రతినిధి కాల్వ సుజాత జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎంపీపై తెలంగాణలో కేసు నమోదైంది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి కాల్వ సుజాత జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆయన చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఆమె పిటిషన్‌లో కోరారు. ఈ సందర్భంగా కాల్వ సుజాత మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ, బీఆర్ఎస్ కలిసి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.
రాజ్య సభలో ఆన్ రికార్డ్ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇందుకు సాక్ష్యమన్నారు. ఆయన వ్యాఖ్యలపై సీబీఐ విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని, ఎవరెన్ని కుట్రలు చేసినా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టలేరని ధీమా వ్యక్తం చేశారు.
కాగా, రాజ్యసభలో విజయసాయిరెడ్డి ఏమన్నారంటే.. ‘‘తెలంగాణలో కాంగ్రెస్ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది. మరో మూడు నెలల్లో ఆ ప్రభుత్వం కూలిపోతుంది.. కాంగ్రెస్ పార్టీకి 2029లో దేశంలో ఒక్క ఎంపీ సీటు కూడా ఉండదు..’’ అంటూ జోస్యం చెప్పారు. దీంతో కాల్వ సుజాత ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.