మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు (mynampalli hanumantharao)తన అనుచరులతో సమావేశమయ్యారు. గత కొంతకాలంగా మైనంపల్లి హనుమంత రావు రాజకీయ భవిష్యత్తు ఏమిటనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. మంత్రి హరీష్ రావు (hareesh rao) పై మైనంపల్లి చేసిన ఆరోపణలను బీఆర్ఎస్ (brs) అధిష్టానం సీరియస్గా తీసుకుంది. అయినప్పటికీ బీఆర్ఎస్ అధిష్టానం మైనంపల్లికి మల్కాజ్గిరి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. అదే సమయంలో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన కుమారుడికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వాలనే మైనంపల్లి కోరికకు మాత్రం రెడ్ సిగ్నల్ ఇచ్చింది.
అయితే ఆ తర్వాత కూడా మంత్రి హరీష్ రావుపై మైనంపల్లి ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే మైనంపల్లి రాజకీయ భవిష్యత్తు ఏమిటనే చర్చ మొదలైంది. మైనంపల్లి బీఆర్ఎస్లోనే కొనసాగుతారా?, పార్టీని వీడతారా అనే ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే మేడ్చల్ జిల్లా దూలపల్లిలోని తన నివాసం వద్ద అనుచరులతో మైనంపల్లి సమావేశం ఏర్పాటు చేయగా.. మల్కాజ్గిరి, మెదక్ నియోజకవర్గాల నుంచి అక్కడికి పెద్ద ఎత్తున మద్దతుదారులు తరలివచ్చారు. మైనంపల్లి నాయకత్వం వర్దిల్లాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా మైనంపల్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీని తనేమీ అనలేదని.. పార్టీ కూడా తననేమీ అనలేదని చెప్పారు. తాను వెనక్కి తగ్గే వ్యక్తిని కాదని అన్నారు. ప్రాణం పోయే వరకు ఉన్నదే మాట్లాడతానని అన్నారు. తనను వ్యక్తిగతంగా ఇబ్బంది పెడితే.. తాను కూడా ఇబ్బంది పెడతానని చెప్పారు. తనకు సత్తా ఉందని.. చర్యకు ప్రతిచర్య ఉంటుందని అన్నారు. మెదక్ నియోజకవర్గంలో ముఖ్య నాయకులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. తనను ఎవరూ ఏం అనకుంటే వారి జోలికి వెళ్లనని చెప్పారు.
తాను రేపటి నుంచి వారం రోజుల పాటు మల్కాజ్గిరి నియోజకవర్గంలో పర్యటిస్తానని చెప్పారు. వారం తర్వాతనే మీడియాతో మాట్లాడతానని తెలిపారు. బీఆర్ఎస్లో పెద్ద నాయకుడు తనకు ఫోన్ చేసినట్టుగా పేర్కొన్నారు. తొందరపడొద్దని చెప్పారని.. ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలని సూచించారని కూడా తెలిపారు. మీడియాతో మాట్లాడొద్దని ఆ నాయకుడు ఒట్టు కూడా వేయించుకున్నారని చెప్పారు. వారం రోజులు మాల్కాజ్గిరి నియోజకవర్గంలో పర్యటిస్తానని.. ఆ తర్వాతే మీడియాతో మాట్లాడతానని అన్నారు.