Telugu News » Nagar Kurnool : మానవత్వాన్ని నిరూపించుకొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే.. గర్భిణీ మహిళకు కాన్పు..!!

Nagar Kurnool : మానవత్వాన్ని నిరూపించుకొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే.. గర్భిణీ మహిళకు కాన్పు..!!

లింగాల మండల కేంద్రానికి చెందిన తొమ్మిది నెలల గర్భిణి ప్రసన్నకు పురిటి నొప్పులు రావటంతో, కుటుంబ సభ్యులు 108లో అచ్చంపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు స్కానింగ్‌ చేయగా గర్భంలోని శిశువు మెడకు పేగు చుట్టుకొందని తెలిసింది.

by Venu
telangana congress cm swearing ceremony telangana assembly election results 2023

ఎమ్మెల్యే అంటే రాజకీయాలు చేయడమే కాదు.. చదువుకొన్న చదువుకు సార్థకత చేకూరేలా.. మానవత్వాన్ని సైతం చూపించడమని కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్యే నిరూపించి శభాష్ అనుకొంటున్నారు.. నాగర్ కర్నూలు (Nagar Kurnool)జిల్లా, అచ్చంపేట (Acchampet)లో చోటు చేసుకొన్న ఈ ఘటన వివరాలు తెలుసుకొంటే..

లింగాల మండల కేంద్రానికి చెందిన తొమ్మిది నెలల గర్భిణి ప్రసన్నకు పురిటి నొప్పులు రావటంతో, కుటుంబ సభ్యులు 108లో అచ్చంపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు స్కానింగ్‌ చేయగా గర్భంలోని శిశువు మెడకు పేగు చుట్టుకొందని తెలిసింది. ఆసుపత్రిలో గైనకాలజిస్టు ఉన్నప్పటికీ.. హైరిస్కు కేసు కావడంతో జిల్లా కేంద్రంలోని జనరల్‌ ఆసుపత్రికి తీసుకెళ్లాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ సూచించారు.

ఆర్థిక స్తోమత లేని కారణంగా.. గర్భిణిని తరలించేలోపు అనుకోనిదేమైనా జరిగితే ఎలా అని భయపడిన ఆమె కుటుంబసభ్యులు.. వెంటనే ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ (MLA Dr. Vamsikrishna)కు ఫోన్‌ చేసి విషయం తెలిపారు. అయితే ఉప్పునుంతల పర్యటన నుంచి తిరిగివస్తున్న ఎమ్మెల్యే.. ఆందోళన చెందవద్దని గర్భిణీ కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చారు. వెంటనే సిజేరియన్‌కు ఏర్పాట్లు చేయాలని అచ్చంపేట ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.

ఈలోపల అచ్చంపేట ఆసుపత్రికి చేరుకొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ, గైనకాలజిస్టు డాక్టర్ స్రవంతితో కలిసి గర్భిణికి సిజేరియన్‌ చేశారు. ప్రసన్న పండంటి ఆడ శిశువు జన్మనివ్వగా.. తల్లీబిడ్డల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.. ప్రజాప్రతినిధిగా బిజీగా ఉన్నా.. ప్రభుత్వాసుపత్రికి వచ్చి స్వయంగా ప్రసవం చేసినందుకు ఎమ్మెల్యేకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

You may also like

Leave a Comment