నాగార్జున సాగర్ ప్రాజెక్టు(Nagarjuna Sagar Project) వద్ద అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. ఏపీకి నీళ్లు విడుదల చేయాలని ఏపీ పోలీసులు(AP Police) ఆందోళన గేటు నెంబర్ 13 ఓపెన్ చేయడానికి ప్రయత్నించారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజునే ఈ ఘటన జరగడం చర్చనీయాంశమైంది.
అయితే ఆందోళన నేపథ్యంలో జిల్లా నేత కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, స్థానిక నేత కుందూరు జానారెడ్డి స్పందించారు. ఏపీ పోలీసులు డ్యాం పైకి రావడం సరైన చర్య కాదన్నారు. తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసులను గాయపరచడాన్ని ఖండించారు. ఇలాంటి ఘటనలు రెండు ప్రాంతాల మధ్య వైశమ్యాలకు కారణమవుతాయని అన్నారు.
నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. సాగర్ డ్యాం దగ్గర హైడ్రామా బీఆర్ఎస్ పార్టీ.. కేసీఆర్ పన్నాగమని కోమటిరెడ్డి ఆరోపించారు. పోలింగ్ రోజు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి సెంటిమెంట్ రగిలించేందుకు చేసిన ఎత్తుగడ అని ధ్వజమెత్తారు. ఇన్ని రోజులు లేనిది పోలింగ్ రోజు మాత్రమే గుర్తుకొచ్చిందా? అని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. తెలంగాణ, ఏపీ ప్రజలు ఎవరూ ఈ విషయాన్ని నమ్మొద్దని, ఇదంతా ఓట్ల కోసం ఆడుతున్న డ్రామా అని స్పష్టం చేశారు. కేసీఆర్ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, డ్రామాలు ఆడినా కాంగ్రెస్ పార్టీ గెలుపును ఆపలేరని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 90 సీట్లలో గెలుపు ఖాయం అని ఆయన జోస్యం చెప్పారు.
జానారెడ్డి మాట్లాడుతూ.. వివాదం ఏదైనా రెండు ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడుకోవాలి. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల స్పందన తర్వాత మరో సారి మాట్లాడుతానన్నారు. రెండు ప్రాంతాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. వెంటనే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లేదా కృష్ణ రివర్ బోర్డు, కేంద్ర ప్రభుత్వం స్పందించాలని కోరారు.