నయనతార(Nayanathara) నటించిన అన్నపూర్ణి(Annapurni) సినిమా వివాదంలో చిక్కుకుంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో అన్నపూర్ణి సినిమాతో పాటు నయనతారపై కూడా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. థియేటర్లలో రిలీజైనప్పటి నుంచి ఈ మూవీపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ సినిమా ఓటీటీ(OTT)లో రిలీజ్ అయినప్పటి నుంచి ఈ వివాదం తారాస్థాయికి చేరుకుంది.
ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సైతం ‘అన్నపూర్ణి’ సినిమాను స్ట్రీమింగ్ నుంచి తొలగించింది. తాజాగా నయనతార సినిమాపై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే(Telangana BJP MLA) రాజా సింగ్(Rajasingh) సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నపూర్ణి సినిమాను నిర్మించిన జీ స్టూడియోస్‌ను పూర్తిగా నిషేధం విధించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
గతంలో ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయని, అయితే, భవిష్యత్‌లో మరెవరూ ఇలాంటి చిత్రాలు తీయకుండా దర్శక నిర్మాతలు, నటీనటులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌కు రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను రిలీజ్ చేశారు.
ప్రస్తుతం రాజాసింగ్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కాగా డిసెంబర్ 1న థియేటర్లలో విడుదలైన అన్నపూర్ణి సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అదే సమయంలో వివాదాలను మూటగట్టుకుంది. సినిమాలో హిందువులను కించ పరిచే సన్నివేశాలున్నాయంటూ, లవ్ జిహాదీని ప్రోత్సహించేలా ఉందంటూ కొన్ని హిందూ సంఘాలు రోడ్డెక్కాయి.