ఎన్ఐఏ(NIA) అధికారులు దేశవ్యాప్తంగా దాదాపు 30కి పైగా చోట్ల సోదాలు(Raids) చేపట్టారు. రాజస్థాన్, చండీఘడ్, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో దాడులు నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదుల, గ్యాంగ్స్టర్ల(Gangsters)తో లింకున్న కేసులో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఇవాళ తెల్లవారుజాము నుంచే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు.
జనవరి 6న తేదీన ఉగ్రవాదం, గ్యాంగ్ స్టర్, డ్రగ్ స్మగ్లింగ్ కు చెందిన భారీ కుట్రను ఎన్ఐఏ అధికారులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కు చెందిన నాలుగు ప్రాపర్టీలను అధికారులు సీజ్ చేశారు. 1967 నాటి యూఏపీఏ చట్టం కింద ఆ ఆస్తుల్ని ఎన్ఐఏ జప్తు చేసింది.
అక్రమంగా వస్తున్న నిధుల్ని ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసు విచారణలో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ ఆయా రాష్ట్రాలకు చెందిన పోలీసు బృందాలను మోహరించింది. ఈ భారీ ఆపరేషన్‌లో భాగంగా అనుమానిత నివాసాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా, పర్దీప్ కుమార్ వంటి సామాజిక నాయకులు, ప్రముఖుల హత్యలతో సంబంధం ఉన్న వారి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ కార్యకలాపాలలో సరిహద్దు నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలు, ఇంప్రూవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైజ్‌లు వంటి ఉగ్రవాద హార్డ్ వేర్లను అక్రమంగా రవాణా చేయడం, కొనుగోలు చేయడం వంటివి ఉన్నాయని ఏజెన్సీ పేర్కొంది.