నిజామాబాద్ జిల్లా(Nijamabad District) ఆర్మూర్ పట్టణ కేంద్రంలో ఘటన చోటుచేసుకుంది. స్థానిక జర్నలిస్టు కాలనీ(Journalist Coloney)కి అనుకొని ఉన్న నిజాంసాగర్ కెనాల్ కట్ట(Nizamsagar Canal embankment) ఇవాళ(సోమవారం) తెల్లవారుజామున తెగిపోయింది. దీంతో అప్పటికే గాఢ నిద్రలో ఉన్న కాలనీవాసులు ఇళ్లలోకి నీరు చేరడంతో అప్రమత్తమయ్యారు. ఏం జరిగిందో తెలియక భయంతో పరుగులు తీశారు.
స్థానిక అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని జర్నలిస్టు కాలనీ వాసులు కోరుతున్నారు. తెల్లవారు జామున 3 గంటలకు కెనాల్ కట్ట తెగిన ఇప్పటి వరకు ఇరిగేషన్ అధికారులు(Irrigation authorities) స్పందించకపోవడం గమనార్హం. ఆర్మూర్‌లో 82-2 నిజాంసాగర్ ప్రధాన కాలువ ఉదయం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో తెగిపోయినట్లు తెలుస్తోంది.
దీంతో నిజాంసాగర్ ప్రధాన కాల్వలు మురికి కాల్వలుగా మారి చెత్తాచెదారంతో నిండింది. ఇరిగేషన్ అధికారుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. వారి నిర్లక్ష్యం కారణంగానే కెనాల్ తెగిపోయిందని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు అధికారులు కాల్వల ద్వారా ప్రజలకు తాగునీటితో పాటు రైతులకు సాగునీటిని అందిస్తున్నారు.
కాలువ తెగిపోవడంతో జర్నలిస్టు కాలనీలోకి నీరు చేరి నీటి ప్రవాహం ఉధృతంగా ప్రవహించింది. దీంతో విద్యుత్తు స్తంభాలు నేలకూలడంతో పాటు విద్యుత్ సరఫరా సైతం నిలిచిపోయింది. జర్నలిస్ట్ కాలనీలోని ప్రధాన కాలువకు అధికారుల కార్యాలయాలు కూతవేటు దూరంలో ఉన్నా పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. ఆర్మూరు ప్రాంతంలోని ఇరిగేషన్ అధికారులు మరి దీనిపై ఎలా స్పందిస్తారు అనేది ప్రశ్నార్థకంగా మారింది.