రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న నిక్కీ హేలీ (Nikki Haley) భారత్‌పై బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అగ్రరాజ్యం అమెరికా (USA)కు భారత్ భాగస్వామిగా ఉండాలనుకుంటుందన్నారు. కానీ, ఇప్పటికైతే అమెరికా పెద్దన్న పాత్ర పోషించటంపై మాత్రం వారికి విశ్వాసం లేదని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల మధ్య భారత్ చాలా తెలివిగా వ్యవహరిస్తోందన్నారు. అందుకే రష్యాకు సన్నిహితంగా ఉంటూ వస్తోందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తాను అమెరికా (USA) తరపున భారత వ్యవహారాలనూ చూశానని ప్రధాని మోడీ మాట్లాడానని తెలిపారు. వారు రష్యాతో కాకుండా అమెరికాతో భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నారని, ప్రస్తుతం వారికి మన నేతృత్వంపై నమ్మకం లేదన్నారు.
మనం చాలా బలహీనంగా ఉన్నామనుకుంటున్నారని, భారత్ చాలా స్మార్ట్‌గా వ్యవహరిస్తోందని తెలిపారు. అందుకే వారికి భారీ ఎత్తున సైనిక ఆయుధాలను అందించే రష్యాకు సన్నిహితంగా ఉంటూ వస్తోందని హేలీ అన్నారు. అమెరికా ప్రస్తుతం మధ్యప్రాచ్య దేశాలపైనే అధికంగా దృష్టి సారిస్తోందని హేలీ చెప్పారు. అలా కాకుండా ఇతర భాగస్వాములతోనూ సత్సంబంధాలను నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
అప్పుడే అమెరికాతో మిత్రదేశాలైన భారత్, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, జపాన్, దక్షిణకొరియా, న్యూజిలాండ్ కలిసి వస్తాయని వివరించారు. ప్రస్తుతం చైనా ఆర్థిక పరిస్థితి బాగోలేదని హేలీ (Nikki Haley) అన్నారు. రానురానూ అక్కడి ప్రభుత్వం మరింత నియంతృత్వంగా మారుతోందని విమర్శించారు. గతకొన్నేళ్లుగా వారు అమెరికాతో యుద్ధానికి సన్నద్ధమవుతున్నారని.. అది వారి తప్పిదమని వ్యాఖ్యానించారు.