నిపా వైరస్ విజృంభిస్తోంది. పెరుగుతున్న కేసులు కరోనా నాటి పరిస్థితులను తలపిస్తున్నాయి. కరోనా కట్టడికి ఉపయోగించిన కంటైన్ మెంట్ జోన్ల విధానాన్ని అధికారులు ఉపయోగిస్తున్నారు. పలు చోట్ల పాఠశాలలను తాత్కాలికంగా మూసి వేస్తున్నారు. పాజిటివ్ వ్యక్తులను, వారితో కాంటాక్ట్ లో ఉన్న వ్యక్తులను గుర్తించి అధికారులు చికిత్స అందిస్తున్నారు.
తాజాగా కేరళలో మరో నిపా కేసు నమోదైంది. దీంతో ఇప్పటి వరకు నమోదైన నిపా కేసుల సంఖ్య ఆరుకు చేరుకున్నట్టు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి వెల్లడించారు. 39 ఏండ్ల వ్యక్తిలో నిపా వైరస్ ను గుర్తించినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్య వేక్షిస్తున్నట్టు తెలిపారు. నిపా కేసుల సంఖ్య ఆరు వుండగా అందులో ఇద్దరు మరణించినట్టు చెప్పారు.
ప్రస్తుతం నాలుగు కేసులు యాక్టివ్ గా వున్నాయన్నారు. మరోవైపు కోజికోడ్ లో ఆంక్షలు కొనసాగుతాయన్నారు. నిపా కేసుల నేపథ్యంలో కొజికోడ్ జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు రెండు రోజుల పాటు మూసి వేయాలని జిల్లా కలెక్టర్ గీతా ఆదేశించారు. విద్యార్థులకు రెండు రోజుల పాటు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని విద్యాసంస్థలకు ఆదేశాలు జారీ చేశారు.
నిపా కేసులు పెరుగుతున్న క్రమంలో వైద్యాధికారులతో సీఎం పినరయి విజయన్ సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. నిపా కట్టడికి అవసరమైన అన్ని రకాల చర్యలను తాము తీసుకుంటున్నామని సీఎం తెలిపారు. ఎవరూ భయపడాల్సిన పని లేదన్నారు. అటవీ ప్రాంతాల్లో నివసించే వాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచనలు చేశారు.