మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత(BRS Leader) నిరంజన్‌రెడ్డి(Niranjan Reddy) కాంగ్రెస్ పార్టీ(Congress Party)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా 125 అడుగుల విగ్రహానికి పూలమాల వేసేందుకు కాంగ్రెస్ పార్టీకి మనసు రాలేదని విమర్శించారు. ప్రపంచంలో అత్యంత ఎత్తు అయిన అంబేడ్కర్ విగ్రహం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేసీఆర్ కట్టారనే అక్కసుతో కాంగ్రెస్ నాయకులు ఆ విగ్రహానికి పూలమాల వేయలేదని ఆరోపించారు.
ఇదేదో యాదృచ్చికంగా జరిగింది కాదని స్పష్టం చేశారు. అలా అనుకుంటే సచివాలయాన్ని కట్టిందీ కేసీఆరేనని, అందుకు ఎందుకు పాలన చేస్తున్నారని ప్రశ్నించారు. అంబేడ్కర్‌ను ఓడించిందే కాంగ్రెస్ పార్టీ అని, మొదటి నుంచీ అంబేడ్కర్‌ను వ్యతిరేకిస్తోందని దుయ్యబట్టారు. దళితులను కేవలం ఓట్ల కోసమే వాడుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని దళితులు, మైనార్టీలు ఇది గమనించాలని సూచించారు. అంబేడ్కర్‌ను అగౌరపరచడమంటే రాజ్యాంగాన్ని అగౌరపరచడమేనని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ తక్షణమే క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున మాజీమంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు తెలంగాణ ప్రజల బాగోగులు తెలియదని, తెలంగాణ రాష్ట్రంలో 5 పార్లమెంట్ సీట్లు కాంగ్రెస్ గెలవడమే గగనమని ఎద్దేవా చేశారు. దమ్ముంటే సీఎం రేవంత్ రెడ్డి సొంత పార్లమెంట్ నియోజకవర్గంలో ఆయన గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఒకవైపు పంటలు ఎండిపోతుంటే ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు సీఎం వెళ్లాడని విమర్శించారు.
అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ నీటి వ్యాపారానికి తెరలేపిందన్నారు. ఈ ప్రభుత్వానికి తాగునీరు, సాగునీరు ఎలా ఇవ్వాలో తెలియడంలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే 200 మందీ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, రైతులు ఇబ్బందులు పక్కన పెట్టి కండువాలు కప్పే పనిలోనే కాంగ్రెస్ లీడర్లు నిమగ్నమయ్యారని విమర్శించారు. యాసంగి పంటను ఎంఎస్పీ ధర ఇచ్చి 500బోనస్‌తో వడ్లు కొనాలని డిమాండ్ చేశారు.