బీఆర్ఎస్ (BRS) పార్టీలో రోజురోజుకి అసంతృప్తి, గ్రూపు రాజకీయాలు బయట పడుతున్నాయి. ఇప్పటికే ముధోల్ (Mudhol) సిట్టింగ్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి (Vithal Reddy)పై ఆ పార్టీ సీనియర్ నేతలు అసమ్మతి రాగం వినిపించారు. ఈ వ్యవహారం సద్దుమణగక ముందే మరో అసమ్మతి వర్గం నేతలు హైదరాబాద్‌లో మకాం వేసి అధిష్టానానికి విఠల్‌రెడ్డి పై వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడం పార్టీ వర్గాలలో కలకలం సృష్టించింది.
తాజాగా ఈ నియోజకవర్గం నుంచి సుమారు 1500 మందికి పైగా నేతలు, కార్యకర్తలు కమలం గూటికి చేరారు. భైంసా ఏఎంసీ చైర్మన్ రాజేశ్ బాబు, పలువురు ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు, సీనియర్ లీడర్లు తో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ (BJP)లో చేరారు. హైదరాబాద్‌లో పార్టీ చీఫ్ కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ కండువాలు కప్పుకున్నారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, ముధోల్ బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి.
మరోవైపు గత కొంత కాలంగా ఎన్నికల్లో విఠల్ రెడ్డికి టికెట్ ఇవ్వొద్దని ఇక్కడి నేతలు బీఆర్ఎస్ ముఖ్య నాయకులకు విన్నవించుకొంటున్నారు. ఈ విషయం మంత్రి కేటీఆర్ దృష్టికి కూడా వెళ్ళింది. ఇంత చెప్పిన కానీ విఠల్ కి టికెట్ కేటాయించడం నచ్చని నేతలు ఐదు రోజుల క్రితం బీఆర్ఎస్కు మూకుమ్మడిగా రాజీనామా చేశారు.
అయితే ఈ పరిణామాలు గమనిస్తున్నరాజకీయ విశ్లేషకులు అసంతృప్తి వర్గం బీజేపీలో చేరితే ముధోల్ బీఆర్ఎస్ కి భారీ మూల్యం తప్పదని పేర్కొంటున్నారు. మొన్నటికి మొన్న కుంటాల మండలానికి చెందిన బీఆర్ఎస్ నేత రమణారావు సైతం రాజీనామా చేయడం, ఈ మండలానికి చెందిన నర్సాగౌడ్ రాజీనామా చేయడం పార్టీకి పెద్ద మైనస్ అంటున్నారు రాజకీయ నిపుణులు. ఏదేమైనా రాబోయే అసెంబ్లీ ఎన్నికలు చాలా రసవత్తరంగా సాగుతాయని జరుగుతున్న మార్పులను బట్టి తెలుస్తుంది..