బిహార్ (Bihar)లో మహా కూటమి పతనం దిశగా పయనిస్తోంది. రెండు రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతోందని తెలుస్తోంది. బిహార్ సీఎం, జేడీయూ (JDU) చీఫ్ నితీశ్ కుమార్ (Nitish Kumar) మరోసారి ఎన్డీఏ కూటమిలో చేరతారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. బీజేపీ మద్దతుతో నితీశ్ కుమార్ మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో సభ్యులుగా ఉన్న ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తీరుతో నితీశ్ కుమార్ అసంతృప్తిగా ఉన్నారని ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. మరోవైపు ఇండియా కూటమిలో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుతో ఆయన విసిగి పోయారని అంటున్నారు. ముఖ్యంగా సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ నిర్ణయం తీసుకోకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనైనట్టు సమాచారం.
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ ప్రయోజనాల కోసమే రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర చేపట్టారని, ఇండియా కూటమి కోసం కాదని నితీశ్ కుమార్ విశ్వసిస్తున్నట్టు జేడీయూ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇండియా కూటమి చైర్మన్ పదవిని ఆయన ఆశించారని, కానీ ఆయనకు కన్వీనర్ పదవిని ఇవ్వడంతో ఆయన పూర్తి అసంతృప్తికి చెందినట్టు పేర్కొంటున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన ఇండియా కూటమికి బైబై చెప్పాలనే ఆలోచనలో ఉన్నారంటున్నాయి.
మరో వైపు లోక్ సభ సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ సమాయంలో ప్రభుత్వం పడిపోతే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలను ఏక కాలంలో ఎదుర్కోవడం పార్టీకి కాస్త ఇబ్బందిగా మారుతుంది. ఈ నేపథ్యంలో జేడీయూకు మద్దతించేందుకు బీజేపీ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. బీజేపీకి రెండు డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చేందుకు జేడీయూ-బీజేపీ మధ్య ఒప్పందం కుదిరినట్టు సమాచారం.