No Confidene Motion : రాజ్యసభలో గురువారం ఒక దశలో కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే సహనం కోల్పోయారు. ఆయన మాట్లాడుతుండగా బీజేపీ ఎంపీలు అడ్డు తగులుతూ నినాదాలతో సభను హోరెత్తించారు . మణిపూర్ అంశంపై ప్రధాని మోడీ సభకు వచ్చి మాట్లాడాలని, మణిపూర్ హింసపై 167 రూల్ కింద చర్చ చేబట్టాలని ఖర్గే మొదట డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా పాలక పార్టీ సభ్యులు ఆయనను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. వారిని చూస్తూ ఆయన.. ప్రధాని ఈ సభకు వస్తే ఏమవుతుంది ? ఆయన ఏమైనా దేవుడా అని గట్టిగా వ్యాఖ్యానించారు. 167 నిబంధన కింద చర్చ అంటే ఇది ప్రజా ప్రయోజనాలకు ఉద్దేశించినదన్నారు.
సభా నాయకుడు తన చాంబర్ కు వచ్చి 176 కింద చర్చ జరపాలని కోరారని, ఇందుకు తగినంత సమయం ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేశారని , కానీ ఇందుకు తాము ఒప్పుకోక మధ్యేమార్గంగా 167 నిబంధన కింద చర్చను కోరామని ఆయన చెప్పారు. ఈ రూల్ ప్రకారం.. ఓ తీర్మానాన్ని ఆమోదించామని, ఇక సమస్య ఏముందన్నారు.
కానీ సభ బయట మరొక విధంగా మాట్లాడుతున్నారన్నారు. మోడీని రానివ్వండి.. ఆయన ముందు మా సమస్యను విన్నవించుకుంటాం అని చైర్మన్ జగదీప్ ధన్కర్ ను ఉద్దేశించి ఖర్గే అన్నారు. పార్లమెంట్ కు మోడీ వస్తే ఏమవుతుంది.. అని తీవ్రంగా పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలకు మళ్ళీ బీజేపీ ఎంపీలు అడ్డు తగులుతుండగా .. సభ వాయిదా పడింది.