No Confidence Motion : విపక్షాలు ప్రధాని మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం తెచ్చినంత మాత్రాన తాము భయపడేది లేదని హోమ్ మంత్రి అమిత్ షా అన్నారు. అవిశ్వాసం పెడితే తమకెలాంటి అభ్యంతరం లేదన్నారు. మోడీ సర్కార్ పై విపక్షాలు ప్రవేశపెట్టిన ఈ తీర్మానం మీద బుధవారం బీజేపీ తరఫున చర్చలో పాల్గొంటూ ఆయన.. ఇది రాజకీయ దురుద్దేశంతో కూడినదని, ప్రజల్లో అయోమయాన్ని సృష్టించేందుకే దీన్ని తెచ్చారని ఆరోపించారు. మణిపూర్ ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించబోమని, అక్కడి హింసాత్మక ఘటనలు బాధాకరమన్నారు. మణిపూర్ అంశాన్ని విపక్షాలు నీచ రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నాయని ఆయన ఆరోపించారు.
గత తొమ్మిదేళ్లలో మోడీ ప్రభుత్వం 50 కి పైగా చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నదని, మోడీ సర్కార్ కు ఎదురే లేదని పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాలను మోడీ లోగడ ఎన్నో సార్లు సందర్శించారన్నారు, మణిపూర్ పై చర్చ కోసం స్పీకర్ కు లేఖ రాశానని, కానీ ప్రతిపక్షాలకే దీనిపై చర్చించడానికి ఇష్టం లేదని విమర్శించారు. చర్చకు సిద్ధమని తాము మొదటి నుంచీ చెబుతూనే ఉన్నామన్నారు. కానీ కేంద్రం చర్చలకు అంగీకరించడం లేదని ప్రచారం చేశారన్నారు. ఆరున్నరేళ్లుగా బీజేపీ మణిపూర్ లో అధికారంలో ఉందని, ఈ ఆరున్నర ఏళ్లలో అక్కడ కర్ఫ్యూ విధించలేదని చెప్పిన అమిత్ షా., మే వరకు ఆ రాష్ట్రంలో ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగలేదన్నారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఆ తరువాత ఆ రాష్ట్రంలో హింసకు కారణమయ్యాయన్నారు.
మైతీ తెగవారిని గిరిజనులుగా ప్రకటించాకే మణిపూర్ లో హింస పెరిగిందని ఆయన పేర్కొన్నారు. మే 3 న ప్రారంభమైన ఘర్షణలు, అల్లర్లు ఇంకా కొనసాగుతున్నాయన్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని మార్చవలసిన అవసరం లేదని అమిష్ షా స్పష్టం చేశారు. కుకీల గ్రామాల్లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని, ఇందుకు వదంతులే కారణమయ్యాయని ఆయన చెప్పారు.
మణిపూర్ కోలుకొంటోందని, ఇప్పడు ఆజ్యం పోయకండని అన్నారు. మణిపూర్ కు సంబంధించి వైరల్ అయిన వీడియోను పోలీసులకు ఇచ్చి ఉండాల్సిందని అన్నారు. త్వరలోనే ఆ రాష్ట్రంలో పరిస్థితులను సాధారణ స్థాయికి తెస్తామని చెప్పారు. తాను స్వయంగా మూడు రోజులు ఆ రాష్ట్రంలో ఉన్నానని అన్నారు. మణిపూర్ హింసలో మరణించినవారి సంఖ్యను కూడా అమిత్ షా ప్రస్తావించారు.