పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamatha Benarjee) కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress)తో తాము పొత్తు పెట్టుకోబోవడం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల అనంతరం పాన్ ఇండియా స్థాయిలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే అంశాన్ని పరిశీలిస్తామన్నారు.
తాను కాంగ్రెస్‌తో ఎలాంటి చర్చలూ జరపలేదని చెప్పారు. బెంగాల్లో ఒంటరిగానే పోరాడతామని తాను చెప్పానని వెల్లడించారు. తాను వారి ముందు చాలా ప్రతిపాదనలు పెట్టానన్నారు. కానీ వారు వాటిని తిరస్కరించారని చెప్పారు. పొత్తుల విషయంలో దేశంలో మిలిగిలి ప్రాంతంలో ఏం జరుగుతుందనే విషయంపై తనకు ఆందోళన లేదని అన్నారు.
తమ ది సెక్యులర్ పార్టీ అని, బెంగాల్లో తాము ఒంటరిగానే బీజేపీని ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్రపై ఆమె ఫైర్ అయ్యారు. యాత్ర త్వరలోనే బెంగాల్‌కు చేరుకోబోతోందని తెలిపారు. తాను ఇండియా కూటమిలో సభ్యురాలైనప్పటికీ యాత్ర గురించి తనకు సమాచారం ఇచ్చే మర్యాద కూడా లేదని ఫైర్ అయ్యారు.
అందువల్ల బెంగాల్‌కు సంబంధించినంత వరకు కాంగ్రెస్‌తో తనకు ఎలాంటి సంబంధాలూ లేవన్నారు. దేశ వ్యాప్తంగా ఇండియా కూటమి ఉంటుందని, కానీ బెంగాల్ లో మాత్రం టీఎంసీ ఉంటుందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో టీఎంసీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. బెంగాల్లో బీజేపీకి గుణపాఠం చెప్పగలిగేది ఒక్క తృణమూల్ కాంగ్రెస్ మాత్రమేనన్నారు.