Nuh : హర్యానా (Haryana) లోని నూహ్ (Nuh) లో జరిగిన మత ఘర్షణల్లో నిందితుడైన ఆమిర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా లోని తౌరు ప్రాంతంలో మంగళవారం తెల్లవారు జామున జరిగిన ఎన్ కౌంటర్ లో గాయపడిని ఇతగాడిని అరెస్టు చేసినట్టు వారు చెప్పారు. అల్లర్లకు పాల్పడిన నిందితులు ఇద్దరు బైక్ పై పారిపోతుండగా పోలీసులు గుర్తించి వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆమిర్ కాలికి గాయమై కిందపడిపోయాడు.
అతడిని అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. ఇతడి నుంచి నాటు తుపాకిని, అయిదు బులెట్లను స్వాధీనం చేసుకున్నారు. తౌరు సమీపంలోని ఆరావళి హిల్స్ లో ఆమిర్ తన సహచరుడితో కలిసి దాక్కుని ఉన్నాడని సమాచారం అందడంతో ఖాకీలు ఆ ప్రాంతంలో వీరికోసం గాలిస్తుండగా ఆమిర్, అతని సహచరుడు బైక్ పై పారిపోయేందుకు యత్నించారు.
దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఆరావళి హిల్స్ లో ఇంకా ఎవరైనా నిందితులు దాక్కుని ఉన్నారా అన్నది తెలుసుకునేందుకు వారు గాలింపు చర్యలు చేబట్టారు. జులై 31 న నూహ్ లో విశ్వహిందూ పరిషద్ ‘బ్రజ్ మండల్ యాత్ర’ ను నిర్వహించగా జరిగిన మతఘర్షణల్లో ఇద్దరు హోమ్ గార్డులతో బాటు ఆరుగురు మరణించారు. కాగా నూహ్ లోవారం రోజుల్లో ఇది రెండో ఎన్ కౌంటర్ అని పోలీసులు తెలిపారు.
నూహ్ లో జరిగిన ఘర్షణల ప్రభావం పొరుగున ఉన్న గురు గ్రామ్ పై కూడా పడింది. అక్కడి బాద్ షా పూర్ లో ఓ రెస్టారెంట్ తో బాటు 14 దుకాణాలను అల్లరిమూకలు ధ్వంసం చేశాయి. ఈ ఘర్షణలకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు వందమందిని అరెస్ట్ చేశారు.