తెలంగాణ బీజేపీ (BJP) నాయకుడు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ (NVSS Prabhakar)కు కాంగ్రెస్ (Congress) లీగల్ నోటీసు పంపింది. రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జీ దీపాదాస్ మున్షీ (Dipadas Munshi) కాంగ్రెస్ నాయకుల నుంచి బెంజ్ కారు లబ్ది పొందినట్లు ప్రభాకర్ ఆరోపణలు చేశారు. కాగా ఈ ఆరోపణలపై దీపాదాస్ మున్షీ (Deepa Dasmunsi) స్పందించారు. నిరాధార ఆరోపణలపై రెండు రోజుల్లో ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు.
ఒకవేళ ఆధారాలు చూపించని పక్షంలో10 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తానని ప్రభాకర్‌ను దీపాదాస్ మున్షీ హెచ్చరించారు. దీనిపై స్పందించిన ప్రభాకర్ సీరియస్ కామెంట్స్ చేశారు. ఖచ్చితంగా కాంగ్రెస్ నేతల అవినీతి బయట పెడతానని పేర్కొన్నారు. సూట్‌కేసులు, కార్లు గిఫ్ట్ ఇవ్వడాలు కాంగ్రెస్‌లో కామన్ అని ఆరోపించారు. ఈ విషయంలో తనకు ఎలాంటి నోటీసులు అందలేదని.. అందితే సరైన సమాధానం చెప్తానని అన్నారు.
ఇక రాజకీయ లబ్ధి పొందడానికి కాంగ్రెస్ నేతలు.. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనే ప్రచారం చేయడం కాదని.. ఆధారాలు ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు. లేకపోతే మీరు కూడా లీగల్ నోటీసులు అందుకుంటారని ప్రభాకర్ హెచ్చరించారు. కాంగ్రెస్ ఇన్చార్జులను ఎందుకు తొలగించారో ఆ పార్టీ ముఖ్య నేతలు సమాధానం చెప్పాలనన్నారు. ఇదిలా ఉండగా త్వరలో లోక్ సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎంపీ టికెట్ ఆశావాహుల్లో ఒకరు దీపాదాస్ మున్షీకి బెంజ్ కారును బహూకరించినట్లు ఆరోపణలు వచ్చాయి.
దీపాదాస్‌కు బెంజ్ కారు కొనివ్వడంపై తనవద్ద పక్కా సాక్ష్యాధారాలు ఉన్నాయని ప్రభాకర్ స్పష్టం చేశారు. అయితే ఆమెకు ఎవరు కారును గిఫ్ట్‌గా ఇచ్చారన్నది మాత్రం వెల్లడించలేదు. దీపాదాస్ మున్షీపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. దీపాదాస్ మున్షీకి కారు గిఫ్ట్ ఇచ్చిన నేత స్పందిస్తేనే తాను సమాధానం చెబుతానని, ఆధారాలు చూపిస్తానని తెలిపారు..