నేటి కాలంలో పెదరికంలో ఉన్న వారి మరణం సైతం నరకప్రాయంగా మారింది.. ఇది నిజమని నిరూపించడానికి అక్కడక్కడ చోటు చేసుకొంటున్న సంఘటనలు కారణంగా కనిపిస్తున్నాయని అనుకోని వారు లేరు.. ముఖ్యంగా అరకొర వసతులున్న గిరిజన ప్రాంతాల్లో ఎదురయ్యే సమస్యలు ఒక్కోసారి మానవత్వాన్ని ప్రశ్నిస్తాయి.. ప్రస్తుతం ఇలాంటి ఘటన ఒడిశా (Odisha)లో చోటుచేసుకొంది.
అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో ఓ మహిళ మృతదేహాన్ని కుటుంబసభ్యుల సహాయంతో ఆమె భర్త 20 కిలోమీటర్లు మోసుకెళ్లిన దయనీయ ఘటన గురించి దృష్టికి వచ్చిన ప్రతివారు జాలిపడటం కనిపిస్తోంది.. ఈ వ్యధను మృతురాలి భర్త అభి అమానత్య వెల్లడించారు.. మూడు నెలల క్రితం నా భార్య కరుణ (28) ఆడపిల్లకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి కొరాపుట్ (Coraput) జిల్లా, పురుణగూడ (Purunaguda)లోని తన పుట్టింట్లో ఉంటోంది.
అయితే అనారోగ్యంతో శుక్రవారం రాత్రి కరుణ మృతి చెందింది. అంత్యక్రియలు మా ఇంటివద్ద నిర్వహించేందుకు మృతదేహాన్ని నవరంగపూర్ (Navrangpur) జిల్లా, ఫుపుగావ్కు తీసుకెళ్లాలని నిర్ణయించుకొని, మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్, మహాప్రాణ వాహనాలకు పలుమార్లు ఫోన్ చేసినా వారు స్పందించలేదు. వేరే వాహనంలో తీసుకెళ్లేందుకు సరిపడ డబ్బులు లేకపోవడంతో నా భార్య మృతదేహాన్ని 20 కిలోమీటర్లు మోసుకెళ్లానని ఆవేదన వ్యక్తం చేశాడు.