తనకోసం తాను బతికితే ఏముంది.. ఇతరుల కోసం బతికినా, మరణించినా కిక్ ఉంటుందని ఓ సినిమాలో ఉన్న డైలాగ్.. ఈ డైలాగ్ ని నిజం చేశాడు ఓ బస్సు డ్రైవర్ (Bus Driver) .. తన ప్రాణం పోతున్నా పట్టించుకొక 48 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడి మనిషిగా పుట్టినందుకు తన జన్మ సార్ధకం చేసుకున్నాడు అని అనుకుంటున్నారు అతని గురించి విన్న జనం.. కాగా ఈ ఘటన జరిగింది ఒడిశా (Odisha)లోని కంధమాల్ (Kandhamal) జిల్లాలో.. ఆ వివరాలు చూస్తే..
ఒడిశాలోని కంధమాల్ లో ఉన్న గ్రామం నుంచి భువనేశ్వర్ (Bhubaneswar)కు ప్రయాణికులతో బస్సు వెళ్తుంది. ఆ బస్సు నడుపుతున్న డ్రైవరకి మార్గమధ్యలో తీవ్రంగా గుండెపోటు వచ్చింది. ఆ సమయంలో మరో వ్యక్తి అయితే బస్సు స్టీరింగ్ వదిలేసి గుండెను పట్టుకొని విలవిలలాడే వాడు.. కానీ ఆ డ్రైవరకి అంతా బాధలో కూడా కర్తవ్యం గుర్తుకు వచ్చింది.
దీంతో వెంటనే ఆయన బస్సును రోడ్డు పక్కన ఉన్న ఓ గోడకు ఢీకొట్టాడు. దాంతో ఆ బస్సు ఆగిపోయింది. ఆ డ్రైవర్ గుండె కూడా ఆగిపోయింది. కాగా డ్రైవర్‌ను దవాఖానకు తీసుకెళ్లగా అప్పటికే అతను మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. తమ ప్రాణాలు కాపాడి డ్రైవర్ మరణించడంతో ప్రయాణికులు కంటతడిపెట్టారు. ఇక 48 మంది ప్రాణాలు కాపాడి తాను మరణించిన డ్రైవర్ నిస్వార్థ బుద్ధికి హాట్సాఫ్ అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన నెటిజన్స్..